Nepal Plane Crash: ఐదు గంటల సస్పెన్స్‌.. కాలిపోయిన స్థితిలో ప్రయాణికుల మృతదేహాలు

30 May, 2022 09:12 IST|Sakshi

గమ్యస్థానానికి చేరుకోవాల్సింది అరగంటలోపే. కానీ, నింగికి ఎగసిన పావుగంటకే జాడ లేకుండా పోయింది. ఐదు గంటలపాటు సస్పెన్స్‌తో హైడ్రామా నడిచింది.  చివరకు ప్రమాదానికి గురైందన్న ప్రకటనతో.. ప్రయాణికుల బంధువుల రోదనలు మిన్నంటాయి.  విషాదాంతంగా ముగిసిన నేపాల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదంలో ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా కాలిన స్థితిలో లభ్యం అయ్యాయి. 

నేపాల్‌ తారా ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదంలో శకలాలను సోమవారం ఉదయం గుర్తించారు. ప్రయాణికుల మృతదేహాలు కాలిపోయాయని, కొన్ని మృతదేహాలు అసలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. నేపాల్‌ ఆర్మీ, రెస్క్యూ ట్రూప్స్‌తో కలిసి చేపట్టిన ఆపరేషన్‌ ఆదివారం సాయంత్రం మంచు వర్షం కారణంగా ఆపేశారు. అయితే ఈ ఉదయం సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించిన కాసేపటికే మనపతీ హిమాల్‌ కొండచరియల దగ్గర శకలాలను గుర్తించారు. 

ముస్తాంగ్‌ జిల్లా కోవాంగ్‌ గ్రామ శివారులో ఈ తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. నలుగురు భారతీయలతో పాటు మొత్తం 22 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నట్లు నిర్ధారించారు. సోమవారం ఉదయం సానోస్వేర్‌ వద్ద తగలబడుతున్న శకలాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. చనిపోయిన వాళ్లలో నేపాలీలతో పాటు నలుగురు భారతీయులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని, వాళ్ల స్వస్థలం మహారాష్ట్ర థానే అని పేర్కొన్నారు.

కెనడా నిర్మిత 9ఎన్‌- ఏఈటీ జంట ఇంజన్‌ ఆధారిత ఎయిర్‌క్రాఫ్ట్‌.. ఆదివారం ఉదయం 9గం.55 ని. ప్రాంతంలో పోఖారా నుంచి టేకాఫ్‌ అయ్యింది. జోమోసోమ్‌లో అది ల్యాండ్‌ అ‍వ్వాల్సి ఉండగా.. టేకాఫ్‌ అయిన పదిహేను నిమిషాలకే సంబంధాలు తెగిపోయింది. ఈ మార్గం పాపులర్‌ టూరిస్ట్‌ ప్లేస్‌. ప్రయాణానికి కేవలం 20 నుంచి 25 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. 

జీపీఎస్‌ ద్వారా పైలట్‌ ప్రభాకర్‌ మొబైల్‌ సిగ్నల్ష్‌ ట్రేస్‌ చేసి.. విమానం జాడ కనిపెట్టారు అధికారులు. అయితే ప్రమాదానికి గల కారణాలు, విమానం గమ్యస్థానం వైపు కాకుండా మరోవైపు డైవర్షన్‌ కావడం వెనుక కారణాలు తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు