Mad Honey: అధిక మోతాదులో తీసుకుంటే డేంజరే.. అయినా ఈ తేనే ఎందుకు వాడుతారంటే?

18 Aug, 2022 17:20 IST|Sakshi

తేనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది... దాని తీయటి రుచి చిన్నారులకూ తెగ నచ్చుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ అదే తేనె మనకు హాని కలిగిస్తే?! శారీరక, మానసిక అనారోగ్యానికి దారితీస్తే? అయినప్పటికీ వేల ఏళ్లుగా ఇది వాడకంలోనే ఉంటే..! ఏమిటీ విచిత్రం అని అవాక్కవుతున్నారా? ఆగండాగండి.. అన్ని ప్రాంతాల్లో లభించే సాధారణ తేనె రకాల్లో ఈ లక్షణాలు ఉండవులెండి. కేవలం నేపాల్‌లోని హిమాలయ పర్వతసానువుల్లో లభించే అత్యంత అరుదైన, ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైనదిగా పరిగణించే ‘మ్యాడ్‌ హనీ’లోనే ఈ ప్రత్యేకత ఉంది.

దీన్ని పరిమిత మోతాదులో సేవిస్తే కాస్త కళ్లుతిరగడంతోపాటు చెప్పలేనంత ఉత్తేజం, ఉల్లాసం లభిస్తుంది. అందుకే దీన్ని ‘మ్యాడ్‌’ హనీ అని పిలుస్తారు. పర్వత ప్రాంతాల్లో పెరిగే రోడోడెండ్రాన్‌ జాతి మొక్కలు ఉత్పత్తి చేసే గ్రెయనోటాక్సిన్‌ అనే రసాయనం మకరందం, పుప్పొడిలో ఉండటం, వాటినే తేనెటీగలు సేకరించడం ఈ తేనెలో విచిత్ర లక్షణాలకు కారణం. కానీ ఉల్లాసం కలిగిస్తుంది కదా అని దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం డేంజరే. వాంతులు, మూర్ఛ, భాంత్రి భావనలతోపాటు అరుదైన సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది.
చదవండి: పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకి..వాట్‌ ఏ పవర్‌

దీనికితోడు మామూలు తేనె తియ్యగా ఉంటే ఈ తేనె భరించలేనంత చేదుగా ఉంటుంది! మరి ఇంత ప్రమాదకరమైన తేనెను తీసుకోవడం ఎందుకంటారా? లైంగిక సామర్థ్యం పెంచే ఔషధంగా, ఉదర సంబంధ వ్యాధులకు ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతుల్లో దీన్ని వాడుతున్నందుకే. దీన్ని సేకరించడమూ ఎంతో కష్టంతో కూడుకున్నదే. సముద్రమట్టానికి 3,900 అడుగుల నుంచి సుమారు 11,800 అడుగుల ఎత్తులో కొండల అంచున తేనెటీగలు తేనెపట్టును భద్రపరుచుకుంటాయి.

అందుకే అనుభవజ్ఞులైన స్థానికులకే ఈ తేనె సేకరణ సాధ్యం. ఇది ఎక్కువగా నేపాల్‌లోనే లభిస్తున్నప్పటికీ టర్కీలోని నల్ల సముద్ర ప్రాంతంలోనూ దొరుకుతుందట. క్రీస్తుపూర్వం 2,100 నుంచే మ్యాడ్‌ హనీ పర్వత ప్రాంతాల్లో లభిస్తోందని 2018లో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది.  

మరిన్ని వార్తలు