‘అందుకే మా విదేశాంగ మంత్రి భారత్‌కు వెళ్తున్నారు’

11 Jan, 2021 13:01 IST|Sakshi
నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి(ఫైల్‌ ఫొటో)

ఆ భూభాగాలు మావే: కేపీ శర్మ ఓలి

ఖాట్మండు: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరతీశారు. భారత్‌- నేపాల్‌ మధ్య విభేదాలకు కారణమైన కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్‌లను ఎలాగైనా తమ దేశంలో కలుపుకొంటామని పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో జనవరి 14న హిమాలయ దేశపు విదేశాంగ మంత్రి ప్రదీప్‌ కుమార్‌ గ్యవాలి భారత పర్యటనకు రానున్న తరుణంలో ఈ మేరకు ఓలి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘సుగౌలి ఒప్పందం ప్రకారం.. మహాకాళీ నదీ పరివాహక తూర్పు ప్రాంతంలో ఉన్న కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్‌ నేపాల్‌కు చెందుతాయి. భారత్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపి వాటిని సొంతం చేసుకుంటాం. మా విదేశాంగ మంత్రి గురువారం అక్కడికి వెళ్తున్నారు. ఈ అంశంపైనే ఆయన చర్చిస్తారు. ఈ మూడు ప్రాంతాలను మా దేశంలో కలుపుతూ వెలువరించిన మ్యాపుల గురించి కూడా మాట్లాడతారు’’ అని తెలిపారు.

అదే విధంగా.. పొరుగు దేశాలైన భారత్‌, చైనాతో ద్వైపాక్షిక బంధం దృఢపరచుకునేందుకు తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.  సార్వభౌమత్వం కాపాడుకుంటూనే, సమానత్వ భావనతో స్నేహపూర్వక బంధాలు పెంపొందించుకుంటామని ఓలి పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో చైనాకు బాగా దగ్గరైన నేపాల్‌ ప్రధాని కేపీ ఓలి శర్మ.. గత కొన్నినెలలుగా భారత్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదనడం, అంతేగాక ఆ మూడు ప్రాంతాలకు సంబంధించి అధికారిక మ్యాపులు విడుదల చేయడంతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. అయితే భారత సైనిక దళాల ప్రధానాధికారి ఎంఎం నరవాణే నేపాల్‌ నవంబరులో పర్యటించిన నాటి నుంచి విభేదాలు కాస్త సద్దుమణిగాయి. ఏడు దశాబ్దాలుగా భారత్‌- నేపాల్‌ సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్లారు. (చదవండి: నేపాల్‌లో చైనా ఓవరాక్షన్‌)

200 ఏళ్ల నాటి వివాదం
భారత్‌-నేపాల్‌-చైనా సరిహద్దులో గల లిపులేఖ్‌ భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఈ సరిహద్దు వివాదం 200 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇరు దేశాల మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత్‌ తరఫున సంతకాలు చేయగా... ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నేపాల్‌ కొత్త మ్యాపులు విడుదల చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది.  

మరిన్ని వార్తలు