భారత్‌- నేపాల్‌ మధ్య ప్రత్యేక అనుబంధం: కేపీ శర్మ ఓలి

6 Nov, 2020 15:39 IST|Sakshi

ఖాట్మండు: భారత్‌తో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు త్వరలోనే సమసిపోతాయని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి అన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనగలమని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్‌ ప్రాంతాలు తమవేనంటూ కొన్ని నెలల క్రితం నేపాల్‌ మ్యాపులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే గత కొన్నిరోజులుగా ఈ చిటపటలు కాస్త సద్దు మణిగాయి. (చదవండి: ‘నేపాల్‌ భూభాగం ఆక్రమణ’; చైనా స్పందన)

గత ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్‌ భావించగా, అందుకు భారత్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో భారత సైనిక దళాల ప్రధానాధికారి ఎంఎం నరవాణే నేపాల్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్‌ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి, జనరల్‌ నరవాణేకు నేపాల్‌ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. ఖడ్గాన్ని కూడా బహూకరించారు. ఖాట్మండూలోని అధ్యక్ష భవనం శీతల్‌ నివాస్‌లో ప్రధాని ఓలి, భారత రాయబారి వినయ్‌ ఎం. క్వాత్రా సహా ఇరు దేశాల ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.  (చదవండి: నేపాల్‌తో మళ్లీ చెట్టపట్టాలు)

ఇక నేపాల్‌ పర్యటనలో భాగంగా జనరల్‌ నరవాణే శుక్రవారం  ప్రధాని, రక్షణ మంత్రి కేపీ శర్మ ఓలితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధానమంత్రి అధికారిక భవనంలో జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘకాలంగా భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక బంధం గురించి ఓలీ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు నేపాల్‌ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా కాగా నవంబరు 4న సతీమణి వీణా నరవాణేతో కలిసి జనరల్‌ నరవాణే నేపాల్‌ చేరుకున్నారు. పుణ్యక్షేత్రాల సందర్భంతో పర్యటన ఆరంభించిన ఆయన తొలుత,  రాజధానిలో గల కుమారి ఘర్‌కు వెళ్లి దేవీ కుమారి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. ఆ తర్వాత బసంతాపూర్‌ దర్బార్‌ స్వ్కేర్‌ను సందర్శించారు. పర్యటన సందర్భంగా.. ఎక్స్‌రే మెషీన్లు, రేడియోగ్రఫీ సిస్టంలు, ఐసీయూ వెంటిలేటర్లు, వీడియో ఎండోస్కోపీ యూనిట్లు తదితర వైద్య పరికరాలను నేపాల్‌ ఆర్మీ ఫీల్డ్‌ ఆస్పత్రులకు బహుమతిగా అందించారు.

మరిన్ని వార్తలు