KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి

11 May, 2021 04:46 IST|Sakshi

సీపీఎన్, నేపాల్‌ కాంగ్రెస్, జనతా సమాజ్‌వాదీ పార్టీలతో కొత్త ప్రభుత్వం!

ఖాట్మండూ: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రతినిధుల సభ విశ్వాసాన్ని కోల్పోయారు. పుష్పకమాల్‌ దహల్‌ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌) పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన మెజారిటీ కోల్పోయారు. నేపాల్‌ ప్రతినిధుల సభలో మొత్తం 275 మంది సభ్యులు ఉండగా సోమవారం విశ్వాసపరీక్ష కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 232 మంది హాజరయ్యారు. వారిలో 93 ఓట్లు ప్రధాని ఓలికి మద్దతుగా రాగా, 124 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. మరో 15 మంది సభ్యులు తటస్థంగా ఉన్నారని స్పీకర్‌ అగ్ని సప్కోట తెలిపారు.

ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మొత్తం 136 ఓట్లు కావాల్సి ఉండగా, ఆ మార్కును ఓలి అందుకోలేకపోయారు. మెజారిటీ సాధించలేకపోయిన ఓలి నేపాల్‌ రాజ్యాంగంలోని 100 (3) ప్రకరణ ప్రకారం ఆటోమేటిగ్గా పదవిని కోల్పోతారు.

ఇదిలా ఉండగా నేపాలి కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ దేబ, సీపీఎన్‌ చైర్మన్‌ ప్రచండ, జనతా సమాజ్‌వాదీ పార్టీ చైర్మన్‌ ఉపేంద్ర యాదవ్‌లు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాలని దేశ అధ్యక్షుడు భండారిని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు