విమాన ప్రయాణం విషాదాంతం

30 May, 2022 08:15 IST|Sakshi

నేపాల్‌లో నేలకూలిన ‘తారా ఎయిర్‌’ విమానం

నలుగురు భారతీయులు సహా 22 మంది గల్లంతు

ఖాట్మండు: నేపాల్‌లో తారా ఎయిర్‌ సంస్థకు చెందిన 43 ఏళ్లనాటి పాత విమానం ఆదివారం నేలకూలి మంటల్లో చిక్కుకుంది. శకలాలను గుర్తించారు. రెండు ఇంజన్లు గల ఈ చిన్నపాటి ప్యాసింజర్‌ విమానంలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు. సెంట్రల్‌ నేపాల్‌లో పర్యాటక నగరమైన పొఖారా నుంచి సరిగ్గా ఉదయం 10.15 గంటలకు బయలుదేరింది. పశ్చిమ నేపాల్‌లోని జోమ్సమ్‌ ఎయిర్‌పోర్టులో ఉదయం 10.15 గంటలకు ల్యాండ్‌ కావాల్సి ఉండగా, బయలుదేరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్‌ టవర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు తారా ఎయిర్‌ అధికార ప్రతినిధి సుదర్శన్‌ బర్తౌలా చెప్పారు. 

ముస్తాంగ్‌ జిల్లాలోని కోవాంగ్‌ గ్రామం వద్ద మనపతీ హిమాల్‌ కొండచరియల కింద లామ్చే నది ఒడ్డున విమానం శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) ద్వారా పైలట్‌ ప్రభాకర్‌ ఘిమిరే మొబైల్‌ సిగ్నల్స్‌ ట్రాక్‌ చేసి, విమానం జాడ కనిపెట్టినట్లు నేపాల్‌ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అయితే, ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. 

ప్రయాణికుల్లో ముంబై సమీపంలోని థానేకు చెందిన ఆశోక్‌ కుమార్‌ త్రిపాఠి, ఆయన భార్య వైభవీ బండేకర్, వారి పిల్లలు ధనుష్‌ త్రిపాఠి, రితికా త్రిపాఠితోపాటు ఇద్దరు జర్మనీ పౌరులు, 13 మంది నేపాలీలు, ముగ్గురు నేపాల్‌ సిబ్బంది ఉన్నట్లు తారా ఎయిర్‌ అధికార ప్రతినిధి సుదర్శన్‌ బర్తౌలా వెల్లడించారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  నేపాల్‌లో 2016లో తారా ఎయిర్‌కు చెందిన విమానం ఇదే పొఖారా–జోమ్సమ్‌ మార్గంలో కూలిపోయింది. విమానంలోని 23 మంది దుర్మరణం పాలయ్యారు.  

మరిన్ని వార్తలు