పార్లమెంట్‌లో యువతుల డ్యాన్స్‌ స్టెప్పులు.. భవిష్యత్‌ ఇదేనా అంటూ నెటిజన్లు ఫైర్‌

11 May, 2022 17:12 IST|Sakshi

యూరప్‌ పార్లమెంట్‌లో డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐరోపా భవిష్యత్‌ ఇదేనా అంటూ సోషల్‌ మీడియాలో మండిపడ్డారు. 

వివరాల ప్రకారం.. ఇటీవల యూరప్‌ భవిష్యత్‌పై సమాలోచన జరిగింది. అందులో భాగంగా నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్‌లో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో చివరి రోజు సందర్భంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న అంశంపై చర్చించారు. కాగా, ఈ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా కొందరు యువతీయువకులు ప్రత్యక్షమై 10 నిమిషాల పాటు డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

దీంతో వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) భవిష్యత్తు ఇదే అయితే.. మీరంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లేనని ఘాటుగా వ్యాఖ‍్యలు చేశారు. బ్రిటన్‌కు చెందిన మరో నెటిజన్‌ స్పందిస్తూ.. ఈయూతో బ్రేకప్‌ పట్ల సంతోషంగా ఉన్నానంటూ కామెంట్‌ చేశాడు. మరోవైపు తన కీలక ప్రసంగం ముందు జరిగిన ఈ డ్యాన్స్ ప్రదర్శనపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అసహనం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది: మనికే మగే హితె సింగర్‌ యోహానీ

మరిన్ని వార్తలు