ఆకాశంలో లివింగ్‌ రూమ్‌

27 Mar, 2022 03:41 IST|Sakshi

విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌ అంటేనే కాస్త పర్సనల్‌ స్పేస్‌ ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ప్రయాణించేలా సీట్లు, ఇతర సౌకర్యాలుంటాయి. కానీ అచ్చం ఇంట్లో లివింగ్‌ రూమ్‌లోనే ఉన్నామా అనిపించేలా క్యాబిన్‌ డిజైన్‌ చేస్తే! టీవీ, కర్టెన్లు, కార్పెట్లు, ఇతరత్రా ప్రత్యేక సౌకర్యాలుంటే! ఇలాంటి అద్భుతమైన క్యాబిన్లను సియాటెల్‌కు చెందిన డిజైన్‌ కంపెనీ టియాగ్యు, టెస్లా, ఒక్లహోమాకు చెందిన ఎయిరోస్పేస్‌ కంపెనీ నోర్డామ్‌ కలిసి రూపొందించాయి. ఈ డిజైన్‌కు‘ఎలివేట్‌’ అని పేరు పెట్టాయి. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేశాయి. జర్మనీలోని హాంబర్గ్‌లో ఈ ఏడాది జూన్‌లో జరిగే ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంటీరియర్స్‌ ఎక్స్‌పోలో ఈ డిజైన్లను ప్రదర్శించనున్నాయి. 

తక్కువలో ఎక్కువగా.. 
అద్భుతమైన వాల్‌ అటాచ్‌మెంట్స్, పెద్ద బెడ్‌ సైజు, లివింగ్‌ స్పేస్, వస్తువులు పెట్టుకునేందుకు స్థలం లాంటివి ప్రతి ప్రయాణికుడికి ఉండేలా డిజైన్‌ చేయడం ఇదే తొలిసారని ‘ఎలివేట్‌’ డిజైనర్లు తెలిపారు. ఈ ఇంటీరియర్‌కు విమానంలో ఎక్కువ స్థలం అవసరం ఏమీ ఉండదని, సీట్లు తగ్గించుకోవాల్సిన అవసరమూ రాదని చెప్పారు. పైగా డిజైన్‌లో వాడినవన్నీ తక్కువ బరువున్నవేనని వివరించారు.

దీని వల్ల విమానంపై భారంపడదని, ఎక్కువ ఇంధనం ఖర్చవదని తెలిపారు. చిన్న విమానాల్లో కూడా ఎలివేట్‌ క్యాబిన్లను సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందమైన క్యాబిన్లతో ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి.. ఎక్కువ స్థలం ఉండేలా, సౌకర్యవంతంగా అనిపించేలా, ప్రైవసీ ఉండేలా ఎలివేట్‌ను డిజైన్‌ చేశామని చెప్పారు.     
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు