New Omicron Subvariant: కఠిన ఆంక్షలు అమలు చేసినా కట్టడి కాని కరోనా.. చైనాలో కొత్త వేరియంట్ కలకలం

11 Jul, 2022 08:45 IST|Sakshi

షాంఘై: కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్‌డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్‌ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్‍ను గుర్తించినట్లు నగర హెల్త్ కమిషన్‌ డిప్యూటీ డెరెక్టర్‌ జావో డాండన్‌ వెల్లడించారు. 

రెండు నెలల అనంతరం షాంఘై నగరంలో జూన్ మొదటివారంలో లాక్‌డౌన్‍ను ఎత్తివేశారు. అయితే కొత్త కేసులు వెలుగుచూసిన ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానికంగా వ్యాప్తి చెందుతున్న కేసుల సంఖ్య పెరిగినట్లు జావో వివరించారు. దీంతో షాంఘైలో నివాసముండే వారికి జులై 12-14 మధ్య రెండు రౌండ్ల కరోనా పరీక్షలు నిర్వహించిననున్నట్లు చెప్పారు.

విదేశాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్  BA.5 రకాన్ని చైనాలో తొలిసారి మే 13న షాంఘై నగరంలో గుర్తించారు. ఉగాండ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో ఇది బయటపడింది. ఇప్పుడు అందులోనే సబ్‌వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి.

చైనాలో ఇప్పటివరకు మొత్తం 2,26,610 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 5,226 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా  బారినపడినవారిలో 2,20,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,004 యాక్టివ్ కేసులున్నాయి.

మరిన్ని వార్తలు