Covid Variant: దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్‌

26 Nov, 2021 09:07 IST|Sakshi

ఎయిడ్స్‌ రోగిలో వృద్ధి చెంది ఉంటుందని అనుమానం

అప్రమత్తంగా ఉండాలన్న భారత్‌

లండన్‌/ జొహన్నెస్‌బర్గ్‌: అబ్బో... ఎన్నో వేరియెంట్లను చూసేశాం. అలసిపోయాం... ఇక కరోనాతో సహజీవనం మనకు అలవాటైపోయిందని ఒక రకమైన నిశ్చింతకు వచ్చాం. ఇంతలోనే దక్షిణాఫ్రికా మరో బాంబు పేల్చింది. ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన వేరియెంట్‌ వెలుగుచూసిందని, పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) ఇది కనపడుతోందని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ వైరాలజిస్టు డాక్టర్‌ టామ్‌ పీకాక్‌ వెల్లడించారు.

మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని ఏమార్చగలదని, మరింత వేగంగా వ్యాప్తిచెందగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, బోట్స్‌వనాల్లో ఈ రకానికి చెందిన 100 కేసులను గుర్తించినట్లు తెలిపారు. బి.1.1.529 ఎంతటి ప్రమాదకరం, దీని మూలంగా ఎదురయ్యే విపరిణామాలు ఎలా ఉండనున్నాయనేది అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్తలు గురువారం సమావేశమయ్యారు.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ సోకి చికిత్స పొందని వ్యక్తి శరీరంలో ఈ మ్యూటెంట్‌ అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏమేరకు వేగంగా వ్యాప్తి చెందగలదు, ఎంతటి హానికరమనేది ప్రస్తుత దశలో ఏమీ చెప్పలేమని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తమ శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తూ.. దీని పరిణామక్రమాన్ని నిశితంగా గమనిస్తున్నారని పేర్కొంది. హాంగ్‌కాంగ్‌లోనూ ఈ వేరియెంట్‌ కేసులు బయటపడ్డాయి.  

► దీంట్లో ఏకంగా 32 మ్యూటేషన్లు ఉన్నాయి.
► కె417ఎన్‌– కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను ఏమార్చగలదు  
► ఈ484ఏ– యాంటీబాడీలకు చిక్కదు
► ఎన్‌440కే– యాంటీబాడీలను బొల్తా కొట్టించగలదు
► ఎన్‌501వై.. వైరస్‌ వ్యాప్తిని వేగవంతం చేస్తుంది.
► ఈ వైరస్‌ కొమ్ముల్లో మరే దాంట్లోనూ లేనన్ని మ్యూటేషన్‌లు ఉన్నాయి.  
► ప్రస్తుత వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు ఇప్పటిదాకా వ్యాప్తిలో ఉన్న వేరియెంట్లనే (వైరస్‌పై ఉండే కొమ్ములనే) గుర్తుపట్టగలవు
► కాబట్టి ఇది తేలిగ్గా యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగలదు.  

అక్కడి నుంచి వచ్చేవారితో జాగ్రత్త
కొత్త వేరియెంట్‌ అనవాళ్లు బయటపడ్డ దక్షిణాఫ్రికా, బోట్వ్సానా, హాంగ్‌కాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షించాలని, టెస్టులు ముమ్మరం చేయాలని భారత ప్రభుత్వం గురువారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రదేశాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ దేశాల మీదుగా (వయా) వస్తున్న వారినీ కఠిన పరీక్షల తర్వాతే అనుమతించాలని సూచించింది. అందరి శాంపిల్స్‌ తీసుకొని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ల్యాబ్‌లకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు. 

మరిన్ని వార్తలు