పాక్‌ కొత్త ప్రధాని షెహబాజ్‌.. ఆవేశం స్టార్‌ కూడా!

11 Apr, 2022 20:21 IST|Sakshi

ప్రతిపక్షాలు ఏకంకాగా.. ఎట్టకేలకు ఇమ్రాన్‌ ఖాన్‌ను గద్దె దించి తాను ప్రధాని పీఠం మీద కూర్చోబోతున్నాడు షెహబాజ్‌ షరీఫ్‌ . డెబ్భై ఏళ్ల ఈ ప్రతిపక్ష నేత రాజకీయాలతోనే కాదు.. హత్యారోపణలు, వివాహాలతో, అవినీతి ఆరోపణలతో చాలాసార్లు వార్తల్లోకెక్కాడు కూడా.  అంతేకాదు రాజకీయాల్లోనూ ఆవేశపూరితుడనే పేరుంది ఆయనకి. బహిరంగ సభల్లో, ర్యాలీ, చట్టసభ.. వేదిక ఏదైనా సరే ఊగిపోతూ చేసే ప్రసంగాలు.. జనాల్లో జోష్‌ నింపడమే కాదు.. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అవుతుంటాయి కూడా!.
 

► తొలుత వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న షెహబాజ్‌.. ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించడం మొదలుపెట్టారు. పాక్‌లో ఏ ముఖ్యమంత్రి సాధించలేని ఫీట్‌ను(మూడుసార్లు సీఎంగా ఎన్నిక కావడం) సాధించాడీయన.

► అయితే మొదటి దఫా సీఎంగా పని చేసిన టైంలో నేరాలకు ఘోరాలకు పాల్పడడన్న ఆరోపణలతో బలవంతగా దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. స్వదేశానికి వచ్చే ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి ఆయనకి. చివరకు.. పాక్‌ సుప్రీం కోర్టు జోక్యంతో తిరిగి పాక్‌లో ఎలాగోలా అడుగుపెట్టాడు.  

► అనేక మలుపుల తర్వాత హత్యలకు సంబంధించిన ఆరోపణల్లో షెహబాజ్‌కు విముక్తి లభించింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో.. పంజాబ్‌కు మళ్లీ రెండు, మూడో దఫా సీఎంగా ఎంపికయ్యాడు.  

► సోదరుడు నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటు తర్వాత షెహబాజ్‌ షరీఫ్‌ ‘పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌(పీఎంఎల్‌-ఎన్‌) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2018 నుంచి నేషనల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గళం వినిపించడం మొదలుపెట్టాడు.

► మనీలాండరింగ్‌ కేసులో 2019 డిసెంబర్‌లో ఆయన, ఆయన కొడుక్కి సంబంధించిన ఆస్తులను కొన్నింటినిపై నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో చర్యలు తీసుకుంది. ఆపై లాహోర్‌ హైకోర్టు ఆదేశాలతో ఆయన్ని అరెస్ట్‌ చేయగా.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌ మీద బయటకు వచ్చారు. 

► చివరకు.. ఇమ్రాన్‌ ఖాన్‌ మీది వ్యతిరేకతను వాడుకుని ప్రధాని పీఠంగా కూర్చున్నారు. షెహబాజ్‌ షరీఫ్‌ పాక్‌ 23వ ప్రధాని.     

► 1951, సెప్టెంబర్‌ 23న జన్మించిన మియాన్‌ ముహ్మద్‌ షెహబాజ్‌ షరీఫ్‌.. వ్యాపార-రాజకీయాలతో ఎదిగి సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ కంటే ధనికుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు.  

షెహబాజ్‌.. నుస్రత్‌ను మొదటి వివాహం చేసుకున్నాడు. నలుగురు పిల్లలు, 2003లో తెహమినా దుర్రనితో రెండో వివాహం జరిగింది. 

► అయితే ఆయన వైవాహిక జీవితంపైనా విమర్శలు వినిపిస్తుంటాయి. రహస్యంగా ఎంతో మందిని ఆయన వివాహం చేసుకున్నాడంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుంటారు. 

వంశపారంపర్యంగా వస్తున్న లాహోర్‌లోని రాయివిండ్‌ ప్యాలెస్‌లోనే షెహబాజ్‌ కుటుంబం జీవిస్తోంది.

► అభ్యుదయ కవిగా పేరున్న షెహబాజ్‌.. కవితా పంక్తులను విసురుతూ చేతులను ఆవేశంగా కదిలిస్తూ ప్రసంగాల్ని రక్తికట్టిస్తుంటారు.

► చట్ట సభల్లో, పొలిటికల్‌ ర్యాలీల్లో ప్రత్యర్థుల మీద విమర్శలు సంధించేప్పుడు చేతులు ఆడిస్తూ.. భయంకరంగా ఊగిపోతూ స్పీచ్‌లు దంచుతుంటాడు.

► అందుకే ప్రధాని అయిన ఈ టైంలో ఆయన ఆవేశపూరితమైన ప్రసంగాలు, చేతుల కదిలికలకు సంబంధించిన జిఫ్‌ ఫైల్స్‌, యానిమేషన్‌ బొమ్మలు వైరల్‌ అవుతున్నాయి.

► పాక్‌లోనే కాదు.. ఇప్పుడు ఇండియాలోనూ అందుకు సంబంధించిన మీమ్‌ ట్రెండ్‌ కొనసాగుతుండడం విశేషం.

మరిన్ని వార్తలు