Spinal Cord Implant: వెన్నుముక మార్పిడి..వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..

9 Feb, 2022 13:01 IST|Sakshi

Paralysed Man Walks Again: ఇంతవరకు పంది గుండె, కిడ్ని వంటివి మానవుడికి అమర్చడం వంటి సరికొత్త వైద్యా విధానాలను గురించి తెలుసుకున్నాం. పైగా అవయవాల కొరతను నివారించే ప్రక్రియలో భాగంగా జరిగిన సరికొత్త వైద్యా విధానాలుగా పేర్కొనవచ్చు. అయితే ఇంతవరకు మనం వెన్నముక ఇంప్లాంటేషన్‌(మార్పిడి) గురించి వినలేదు. వెన్నముకకి గాయాలై శరీరం చచ్చుబడి పోయి మంచానికి పరిమితమైన వారికి ఈ ఇంప్లాంటేషన్‌ వరం.

అసలు విషయంలోకెళ్తే...వెన్నముకకు గాయాలవ్వడంతో మంచానికి పరిమితమైన వాళ్లు మళ్లీ తాము జీవితంలో లేచి నిలబడలేమని నిరాశ​ నిస్ప్రహలకి లోనవ్వాల్సిన అవసరంలేదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎలక్ట్రికల్‌ పల్స్‌తో కూడిన వెన్నముక సాయంతో రోగులు నిలబడటమే కాక వ్యాయమాలు కూడా చేయగలరని అంటున్నారు. వెన్నుమక గాయం కారణంగా కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన వాళ్లు సైతం లేచి నిలబడగలరిని ధీమాగా చెబుతున్నారు వైద్యులు.

2017లో మిచెల్ రోకాటి మోటర్‌బైక్ ప్రమాదంలో వెన్నముకకు అయిన గాయం కారణంగా దిగువ శరీర భాగం చచ్చుబడిపోయింది. అయితే రోకాటి ఎలక్ట్రికల్‌ పల్స్‌తో కూడిన వెన్నుముక ఇంప్లాంటేషన్‌తో అడుగులు వేయగలిగారని నేచర్ మెడిసిన్ జర్నల్‌ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ముగ్గరు రోగులు ఈ ఎక్ట్రికల్‌ పల్స్‌తో కూడిన వెన్నముక ఇంప్లాంటేషన్‌ సాయంతో తమ శరీరాన్ని కదిలించగలిగారని తెలిపారు. ఆరు సెంటీమీటర్ల ఇంప్లాంట్‌ను చొప్పించి, పల్స్‌ను చక్కగా ట్యూన్ చేసిన కొద్దిసేపటికే ముగ్గురులో కదిలికలను గుర్తించాం అని అన్నారు.  

ఈ ఎలక్ట్రోడ్‌లు ఇంతకుముందు అమర్చిన వాటి కంటే పొడవుగా, పెద్దవిగా ఉంటాయని తెలిపారు. ఇవి కండరాలను యాక్సెస్‌ చేయగలవని జపాన్‌ లాసాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లోని న్యూరో సర్జన్ జోసెలిన్ బ్లాచ్ చెప్పారు. అంతేకాదు ప్రారంభ దశలో కదిలించటానికి తమ ముందు శరీర భాగాంలో కొంత బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోగి ప్రాక్టీస్‌ చేయడం ద్వారా నిలబడటం, నడవటం వంటివి చేయగలుగుతారన్నారు. అంతేకాదు దాదాపు కిలోమీటర్‌ దూరం వరకు నడవగలుగుతారని చెప్పారు.

పక్షవాతాన్ని పరిష్కరించడానికి ఎలక్ట్రికల్ పల్స్‌లను ఉపయోగించాలనే ఆలోచన నొప్పిని నియంత్రించడానికి ఉపయోగించే సాంకేతికత నుండి ఉద్భవించిందని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్‌ పల్స్‌ కంప్యూటర్‌ ద్వారా యాక్టివేట్‌ అవుతుంటాయి. వీటిని రోజు రోగి యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొంతమంది ఈ ఎలక్ట్రిక్‌ పోల్స్‌ని యాక్టివేట్‌ చేయకుండా కూడా అవయవాలను కదిలించగలిగారని కానీ పూర్తిగా మాత్రం సాధ్యం కాదని న్యూరో సర్జన్‌లు చెబుతున్నారు. ఈ ఏడాది యునైటెడ్ స్టేట్స్ యూరప్‌లో సుమారు  50 నుంచి100 మంది రోగులపై ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు