అతిపెద్ద వ్యాక్సినేషన్.. నర్సుకు తొలి టీకా

15 Dec, 2020 04:30 IST|Sakshi
నర్సు సాండ్రాకు టీకా వేస్తున్న దృశ్యం

అగ్రరాజ్యంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌

శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌

న్యూయార్క్‌:  అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్‌లో ఉన్న లాంగ్‌ ఐలాండ్‌ జ్యుయిష్‌ మెడికల్‌ సెంటర్‌ ఐసీయూలో నర్సుగా పని చేస్తున్న సాండ్రా లిండ్సేకు తొలి వ్యాక్సిన్‌ డోసు ఇచ్చారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కావడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ డోసును సాండ్రా లిండ్సేకు ఇచ్చారు. కరోనా నుంచి త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. అమెరికా చరిత్రలో బాధాకరమైన సమయం ముగిసిపోవడానికి ఇదొక ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

కరోనా వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, పూర్తి రక్షణ ఇస్తుందని ప్రజల్లో విశ్వాసం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. చీకటిలో వెలుగు రేఖ కనిపించినప్పటికీ ప్రజలు కరోనా నియంత్రణ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సాండ్రా సూచించారు. మాస్కులు ధరించాలని కోరారు. కరోనా టీకా తీసుకునేలా ఇతరులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కావడం పట్ల అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘అమెరికాకు శుభాకాంక్షలు, ప్రపంచానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు. న్యూయార్క్‌ గవర్నర్‌ మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ఆయుధం వ్యాక్సిన్‌ అని చెప్పారు. పుస్తకంలోని చివరి అధ్యాయం ఇప్పుడు మొదలైందని పేర్కొన్నారు. తాను కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటానని ఫైజర్‌ సీఈఓ ఆల్బర్ట్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు