కరోనా ఎఫెక్ట్‌.. రోడ్డెక్కిన రెస్టారెంట్‌

26 Sep, 2020 11:37 IST|Sakshi

వినూత్న ఆలోచన.. న్యూయార్క్‌లో ఔట్‌డోర్‌ రెస్టారెంట్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మానవాళి జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బయటి ఫుడ్డు తినడమే ఫ్యాషన్‌గా భావించిన వారు.. ఇప్పుడు ఆ పేరు చెప్తేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు. రెస్టారెంట్లు అన్ని కరోనా దెబ్బకు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ రెస్టారెంట్లు ఓ వినూత్న ఆలోచన చేశాయి. అవుట్‌డోర్‌ డైనింగ్‌(బహిరంగ భోజనం)ని అమలు చేశాయి. ఇది బాగా క్లిక్‌ అయ్యింది. దాంతో ఈ విధానాన్ని పర్మినెంట్‌ చేయాలని భావిస్తున్నట్లు న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డీ బ్లాసియో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాత్కాలిక పద్దతిన ప్రవేశపెట్టిన ఈ విధానం బాగా క్లిక్‌ అయ్యింది. నగర వాసులు కూడా దీన్ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. దాంతో ఈ పద్దతిని శాశ్వతంగా అమలు చేయాలని భావిస్తున్నం’ అన్నారు. ఈ నెల 30 నుంచి న్యూయార్క్‌ నగరంలో 25శాతం ఆక్యుపెన్సీ పరిమితితో ఇండోర్‌ రెస్టారెంట్లు తెరుచుకోనున్న నేపథ్యంలో మేయర్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. (చదవండి: క్లబ్బులు, అన్ని రకాల బార్లు ఇక ఓపెన్‌..)

‘కీలకమైన ఆహార పరిశ్రమకు మద్దతు ఇవ్వడంలో ఓపెన్‌ రెస్టారెంట్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇది చాలా పెద్ద, ధైర్యమైన ప్రయోగం. పైగా విజయవంతమయ్యింది. దీని ద్వారా 90 వేల మందికి ఉపాధి కల్పించాము’ అని బ్లాసియో తెలిపారు. న్యూయార్క్‌ నగరాన్ని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సిటీగా మార్చడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని శాశ్వతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. అవుట్‌డోర్‌ డైనింగ్‌ కోసం ఇప్పటికే 85 వీదులను కార్‌-ఫ్రీ స్ట్రీట్స్‌గా మార్చింది. అయితే శీతాకాలంలో ఈ అవుట్‌డోర్‌ రెస్టారెంట్‌ విధానానికి ఇబ్బంది తలెత్తుతుంది. ఎందుకంటే ఆ సమయంలో విపరీతంగా మంచు కురుస్తుంది.

మరిన్ని వార్తలు