న్యూయార్క్‌లో డ్రీమర్స్‌కు ఓటు హక్కు

10 Jan, 2022 04:50 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికా పౌరసత్వం లేకపోయినప్పటికీ న్యూయార్క్‌ నగరం డ్రీమర్స్‌కి ఓటు వేసే హక్కు కల్పించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి దేశానికి వచ్చి ఇక్కడే పెరిగిన వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో 8 లక్షలకు పైగా యువత ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డ్రీమర్స్‌ ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ  న్యూయార్క్‌ నగర కౌన్సిల్‌ నెల రోజుల క్రితమే ఒక బిల్లును ఆమోదించింది. మేయర్‌ దానిపై ఆమోద ముద్ర వేయడంతో ఆదివారం నుంచి అది చట్టరూపం దాల్చింది. అయితే ఈ చట్టాన్ని కోర్టులో సవాల్‌ చేయనున్నట్టుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దేశ పౌరసత్వం లేని వారికి ఓటు హక్కు కల్పించిన తొలి అతి పెద్ద నగరంగా న్యూయార్క్‌ రికార్డు సృష్టించింది. పౌరులు కాని వారు ఇప్పటికీ అధ్యక్ష, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు.

మరిన్ని వార్తలు