న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా హిప్‌కిన్స్ ప్రమాణ స్వీకారం

25 Jan, 2023 09:06 IST|Sakshi

వెల్లింగ్‌టన్‌: న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా లేబర్‌ పార్టీ నేత క్రిస్ హిప్‌కిన్స్‌ ప్రమాణస్వీకారం చేశారు. కాగా జసిందా ఆర్డెర్న్ గత వారం ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో న్యూజిలాండ్‌ 41వ ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. 

న్యూజిలాండ్ గవర్నర్-జనరల్ సిండి కిరో,  కొద్దిమంది స్నేహితులు, సహచరుల సమక్షంలో క్రిస్‌ హిప్‌కిన్స్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు దృష్టి సారిస్తానని 44 ఏళ్ల హిప్ కిన్స్ ఈ సందర్భంగా వాగ్ధానం చేశారు. 2008లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన 2020లో కోవిడ్‌–19, పోలీస్‌శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

కాగా జనవరి 19న  తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ న్యూజిలాండ్‌ పీఎం జెసిండా ఆర్డెర్న్‌ అందరిని షాక్‌కు గురిచేశారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్‌ పార్టీ సమావేశంలో వెల్లడించారు. కరోనా సంక్షోభం, మైనార్టీ ఊచకోత, ప్రకృతి వైపరీత్యాలు సవాల్‌ ఏదైనా ఆ సమయంలో ఆమె చూపించిన సంయమనం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ప్రధానమంత్రి పదవికి జకిండా ఆర్డెర్న్‌ రాజీనామా చేశారు.

అనంతరం ఆ పదవికి అధికార లేబర్‌ పార్టీ నుంచి ఎంపీ హిప్కిన్స్‌ ఒక్కరే నామినేషన్‌ వేశారు. జన‌వ‌రి 22న‌ ప్రతినిధుల సభ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు న్యూజిల్యాండ్‌ సార్వత్రిక ఎన్నికలకు 9 నెలల కంటే తక్కువ సమయం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
చదవండి: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తాం.. బీజేపీ తీవ్ర అభ్యంతరం

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు