సంచలన నిర్ణయం: ఒక్క కరోనా కేసు.. మూడు రోజులు దేశాన్నే మూసేశారు

18 Aug, 2021 02:22 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో మంగళవారం ఒకే ఒక్క కరోనా కేసు బయట పడింది. దీంతో దేశంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని జెసిందా ఆర్డెర్న్‌ ప్రకటించారు. మంగళ వారం అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభమవు తుందని తెలిపారు. దీంతో ఒక్కసారిగా నిత్యావసర మార్కెట్ల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. న్యూజిలాండ్‌ డాలర్‌ విలువ కూడా పడిపోయింది. ఆక్లాండ్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఆయన కోరమాండల్‌ ప్రాంతాన్ని కూడా సందర్శించాడు. దీంతో ఈ రెండు చోట్లా ఏకంగా వారం పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని జెసిందా ప్రకటించారు. ఆ వ్యక్తికి కరోనా ఎలా సోకిందో నిపుణులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ప్రపంచమంతటా డెల్టా వేరియంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్‌కు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైరస్‌ను కట్టడి చేయడం కాకుండా, అసలు లేకుండా చూసేందుకే లాక్‌డౌన్‌ బాట పట్టాల్సి వచ్చిందని వివరించారు. కరోనా బయటపడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 26 మరణాలు మాత్రమే న్యూజిలాండ్‌లో సంభవించాయి. దేశంలో 32శాతం మందికి మొదటి డోసు, 18శాతం మందికి రెండో డోసు వ్యాక్సినేషన్లు పూర్తయ్యాయి.   

మరిన్ని వార్తలు