న్యూజిలాండ్‌లో చ‌రిత్రలోనే అరుదైన తీర్పు

27 Aug, 2020 10:19 IST|Sakshi

వెల్లింగ్ట‌న్ :  న్యూజిలాండ్ మ‌సీదులో హింసాకాండ‌కు పాల్ప‌డిన  ముష్క‌రుడు బ్రెంట‌న్ టారెంట్‌కు పెరోల్ లేని జీవితఖైదును విధిస్తూ గురువారం కోర్టు  చ‌రిత్రాత్మ‌క తీర్పునిచ్చింది. మ‌సీదులో ప్రార్థ‌న‌లు చేస్తున్న 51మంది అమాయ‌క‌పు ప్రాణాల‌ను బ‌లితీసుకొని ఆ దుర్మార్గాన్ని ఫేస్‌బుక్‌లో చిత్రీక‌రించిన ట్రెంట‌న్‌ను అమాన‌వీయ వ్య‌క్తిగా కోర్టు పేర్కొంది.  ఘ‌ట‌న స‌మ‌యంలో 3 ఏళ్ల శిశువు త‌న తండ్రి కాలికి చుట్టుకొని ఉంటే ఉద్దేశ‌పూర్వ‌కంగా ఈ ప‌సిప్రాణాన్ని కూడా చంపేసిన బ్రెంట‌న్ అత్యంత దుర్మార్గుడిగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇంత‌టి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన వ్యక్తికి పెరోల్ లేని జైవిత ఖైదు విధిస్తున్నాం అని న్యాయమూర్తి కామెరాన్ మాండర్ తీర్పు చెప్పారు. అయితే న్యూజిలాండ్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు పెరోల్ లేని జీవిత‌ఖైదును ఎవ‌రికి విధించ‌లేదు. (చైనా తీరుపై యూకే, యూఎస్‌, జర్మనీ విమర్శలు)

గ‌తేడాది మార్చిలో  న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని అల్ నూర్ మరియు లిన్‌వుడ్ మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్న వారిపై  ముష్క‌రుడు బ్రెంట‌న్  నిర్దాక్షిణ్యంగా కాల్పులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. త‌ద‌నంత‌రం ఈ దుశ్చ‌ర్య‌ను వీడియో తీసి సామాజిక మాధ్య‌మం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ర‌క్ష‌సానందం పొందాడు. నిందితుడు బ్రెంట‌న్‌పై ఇదివ‌ర‌కే 51 హ‌త్యారోప‌ణ‌లు, 40 హ‌త్యాయ‌త్నాల‌కు సంబంధించి కేసులు న‌మోద‌య్యాయి. మొద‌ట త‌న‌కు ఏం తెలియ‌ద‌ని బుకాయించినా విచార‌ణ‌లో త‌ను చేసిన నేరాల‌ను అంగీక‌రించాడు. న్యూజిలాండ్ చ‌రిత్ర‌లో గ‌తేడాది జ‌రిగిన హింసాకాండ అత్యంత బాధాక‌ర‌మైన ఘ‌ట‌న అని  ప్రాసిక్యూటర్ మార్క్ జరీఫె  అన్నారు. ఇక ఈ ఘ‌ట‌న‌లో త‌మవాళ్ల‌ను పొట్ట‌న‌పెట్టేకొని తీర‌ని శోకాన్ని మిగిల్చిన బ్రెంట‌న్‌కు అత్యంత క‌ఠిన‌మైన శిక్ష వేయాల‌ని బాధితులు కోర్టు ఎదుట త‌మ గోడును వెళ్ల‌గ‌క్కారు.  (యూఎస్‌లో దారుణం: ‘మీ అమ్మ, బామ్మను చంపేశా’ )

మరిన్ని వార్తలు