40 నుంచి 10 శాతానికి పడిపోయిన రిషి సునాక్.. 90% లిజ్‌ ట్రస్‌కే ఛాన్స్‌!

30 Jul, 2022 16:33 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ ప్రధాని రేసు తుది దశకు చేరుకుంది. లిజ్ ట్రస్, రిషి సునాక్‌లలో బోరిస్‌ జాన్సన్‌ వారసులెవరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే బ్రిటన్‌కు చెందిన బెట్టింగ్ సంస్థ స్మార్కెట్స్‌ మాత్రం తదుపరి ప్రధాని లిజ్ ట్రస్‌ కావడం దాదాపు ఖాయం అని చెబుతోంది. టోరీ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది ఆమెకే మద్దతుగా నిలుస్తారని పేర్కొంది. రిషి కంటే ట్రస్‌కు ప్రధాని అయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతం ఎక్కువ ఉన్నాయని చెబుతోంది.

బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్, రిషి సునాక్ మధ్య గట్టి పోటీ ఉంటుందని తొలుత భావించారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో ఎక్కువమంది రిషికే మద్దతుగా నిలిచినా.. పార్టీ సభ్యులు మాత్రం లిజ్ ట్రస్‌కు జై కొడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ట్రస్‌కు 60శాతం, రిషికి 40 శాతం విజయావకాశాలు ఉంటాయని అంచనాలు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టోరీ సభ్యులతో సమావేశాలు మొదలుపెట్టాక రిషి విజయావకాశాలు దారుణంగా 10 శాతానికి పడిపోయాయి.

అయితే రేసులో తాను వెనుకబడి ఉన్నాననే విషయాన్ని రిషి సునాక్ అంగీకరించారు. అయినప్పటికీ చివరి వరకు పోరాడుతానని, ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు 1.75లక్షల మంది టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 5న నూతన ప్రధాని ఎవరో అధికారికంగా ప్రకటిస్తారు.
చదవండి: రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు

మరిన్ని వార్తలు