Nigeria Floods: చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు.. 600 మంది మృతి.. 2 లక్షల ఇళ్లు ధ్వంసం

17 Oct, 2022 17:29 IST|Sakshi

అబుజా: దక్షిణ ఆఫ్రికా దేశం నైజీరియాను వరదలు ముంచెత్తాయి. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వివిధ ప్రమాదాల్లో మొత్తం 600 మంది మరణించారు. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విపత్తు అని అధికారులు తెలిపారు.

వరదల కారణంగా దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2 లక్షల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల పంట నీటమునిగింది. సహాయక బృందాలు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

అయితే వరదల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, మౌలిక వసతుల లేమి, పేలవ ప్రణాళిక కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. నైజీరియాలో ప్రతి ఏటా వర్షాకాలంలో వరదలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం భారీ విపత్తు వచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.

వర్షాకాలం పూర్తయ్యే నవంబర్‌ చివరి వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని నైజీరియా వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని మొత్తం 36కు గాను 26 రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉన్నట్లు చెప్పింది.

చదవండి: తాలిబన్ల చేతితో దారుణమైన చావు తప్పదని తెలిసి..!

మరిన్ని వార్తలు