అమెరికా అధ్యక్ష రేసులో నిమ్రత నిక్కీ రాంధవా హేలీ.. మాజీ బాస్‌పై పోటీకి సై

14 Feb, 2023 20:35 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన మహిళ నిలవబోతోంది. నిక్కీ హేలీ 2024లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిపబ్లికన్‌ తరపున నామినేషన్‌ కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వీళ్ల అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

సౌత్ కరోలినా మాజీ గవర్నర్, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి అయిన హేలీ, 2024 రిపబ్లికన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడో విశేషం ఏంటంటే.. 2024 ఎన్నికల కోసం ట్రంప్‌కు తాను ఎట్టిపరిస్థితుల్లో పోటీదారురాలిని కాబోనని ఆమె రెండేళ్ల కిందట ప్రకటించారు. తాజాగా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని బరిలో దిగేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. నిక్కీ హేలీ, నేనే నిక్కీ హేలీ, నేనే అధ్యక్ష రేసులో ఉన్నాను తాజాగా ఓ వీడియో రిలీజ్‌ చేశారామె. 

ఇదిలా ఉంటే జో బైడెన్‌పై ఆమె కొంతకాలంగా విమర్శలు చేస్తూనే.. అధ్యక్ష పదవి పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు నాయకత్వం ద్వారా రిపబ్లికన్‌ పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం తన అభిమతమని ప్రకటించారు. 

నిక్కీ హేలీ అలియాస్‌ నిమ్రత నిక్కీ రాంధవా హేలీ.  ఆమె పూర్వీకులది పంజాబ్. పుట్టినప్పుడు ఆమె పేరు నిమ్రత నిక్కీ రాంధవా హేలీ.  అమె దక్షిణ కరోలినాలో భారతీయ పంజాబీ సిక్కు తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె తండ్రి అజిత్ సింగ్ రాంధవా, తల్లి రాజ్ కౌర్ రాంధవా. వాళ్లు అమృత్‌సర్‌ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమె తండ్రి గతంలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, తల్లి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు.

51 ఏండ్ల నిక్కీ హేలీ తొలి నుంచి రిప‌బ్లిక‌న్ పార్టీలోనే ఉన్నారు. 2004లో తొలిసారి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. 2008లో రెండోసారి గెలుపొందారు. 2010లో కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. గ‌తంలో సౌత్ కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన నిక్కీ హేలీ.. డొనాల్డ్ ట్రంప్ హ‌యాంలో ఐక్య‌రాజ్య స‌మితిలో అమెరికా రాయ‌బారిగా సేవ‌లందించారు.

సౌత్ కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితురాలైన తొలి మ‌హిళ‌గా ఆమె రికార్డు సాధించారు.  

ట్రంప్‌ తన అభ్యర్థిత్వాన్ని ముందుగానే ప్రకటించినా.. అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌డంలో నిక్కీ హేలీ ఓ అడుగు ముందుకేశారు.  ట్రంప్‌, నిక్కీ హేలీతోపాటు అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వం కోసం రిప‌బ్లిక‌న్ పార్టీ నుంచి ఫ్లోరిడా గ‌వ‌ర్న‌ర్ రాన్ డెస్సెంటీస్‌, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ త‌దిత‌రులు పోటీ పడే అవకాశాలున్నాయి. 

నవంబర్ 5, 2024న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు