అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: ఇండో-అమెరికన్‌ నిక్కీ హేలీ

2 Feb, 2023 05:05 IST|Sakshi

వాషింగ్టన్‌: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీ హేలీ(51) ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానన్నారు. ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆమె విడుదల చేసే అవకాశం ఉందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక్కరే ఇప్పటి వరకు రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారాన్ని రెండు నెలల క్రితమే ప్రారంభించారు.

తాజా పరిణామంతో తన మాజీ బాస్‌ ట్రంప్‌కు ఆమె ఏకైక ప్రత్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్‌ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను పనిచేశారు. ట్రంప్‌ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన పక్షంలో బరిలో ఉండబోనంటూ గతంలో ప్రకటించిన హేలీ మనసు మార్చుకున్నారు.

నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రత నిక్కీ రన్‌ధావా హేలీ. ఈమె తల్లిదండ్రులు అజిత్‌ సింగ్‌ రన్‌ధావా, రాజ్‌ కౌర్‌ రన్‌ధావా. పంజాబ్‌ అగ్రికల్చర్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే అజిత్‌ సింగ్‌ కుటుంబంతో కలిసి 1960ల్లో కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు చేరారు.

మరిన్ని వార్తలు