అవన్నీ అబద్దాలే: నిక్కీ హేలీ

25 Aug, 2020 14:25 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్‌ పార్టీ నేత, ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ప్రతిపక్ష డెమొక్రాట్లపై విమర్శల వర్షం కురిపించారు. అమెరికాను జాత్యహంకార దేశంగా అభివర్ణించడం డెమొక్రాట్లకు ఓ ఫ్యాషన్‌గా మారిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలేనని, వలసదారుల కుమార్తెనైన తనకు అమెరికా ప్రజలు గవర్నర్‌గా అవకాశమిచ్చారంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ఐదేళ్ల క్రితం పరిస్థితులు వేరుగా ఉండేవని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ చక్కదిద్దామని చెప్పుకొచ్చారు.(చదవండి: అంతకంటే పీడకల మరొకటి ఉండదు: ట్రంప్‌)

కాగా నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి రిపబ్లికన్ల తరఫున బరిలో దిగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం వెలువడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో మాట్లాడిన ఇండో- అమెరికన్‌ నిక్కీ హేలీ.. అమెరికాలో తమ కుటుంబానికి ఆదరణ లభించిన తీరును ప్రస్తావిస్తూ ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి చెబుతాను. వలసదారుల కుమార్తెను అని చెప్పుకోవడానికి గర్వపడతాను. నా తల్లిదండ్రులు అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. నా తండ్రి టర్బన్‌ ధరించేవారు. మా అమ్మ చీర కట్టుకునే వారు. ఈ నలుపు, తెలుపు ప్రపంచంలో నేను ఓ బ్రౌన్‌ గర్ల్‌ను. తొలుత నా కుటుంబం ఇక్కడ వివక్షను ఎదుర్కొంది. ఎక్కడైనా ఇలాంటివి ఉంటాయి.(చదవండి: మరో నాలుగేళ్లు ట్రంప్‌కు అవకాశమివ్వండి) 

కానీ వాళ్లెపుడూ దాని కారణంగా దేశంపై ద్వేషం పెంచుకోలేదు. మా అమ్మ వ్యాపారవేత్తగా రాణించింది. మా నాన్న 30 ఏళ్లుగా ఓ ప్రతిష్టాత్మక కాలేజీలో పనిచేశారు. ఇక దక్షిణ కరోలినా ప్రజలు నన్ను.. ఆ రాష్ట్రానికి మొదటి మహిళా, మైనార్టీ గవర్నర్‌గా ఎన్నుకున్నారు. ఇంతకుముందు కంటే అమెరికా మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతీ ఒక్కరికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తోంది. ఇవన్నీ డెమొక్రటిక్‌ పార్టీకి కనిపించడం లేదు. 

కేవలం అల్లర్లు, గొడవల గురించే వాళ్లు మాట్లాడతారు. అమెరికాను రేసిస్ట్‌ కంట్రీ అంటారు. కానీ అది అబద్ధం. అబద్దాలు చెప్పడం వాళ్లకు అలవాటుగా మారిపోయింది. అమెరికా పర్‌ఫెక్ట్‌ కాకపోవచ్చు. కానీ అలా మార్చేందుకు మేం అనుసరిస్తున్న విధానాలు పర్‌ఫెక్ట్‌. నిజం చెప్పాలంటూ మన జీవితంలోని అత్యంత చెత్త రోజున కూడా ఇక్కడ మనం జీవించగలం. పోయిన ప్రతి ప్రాణానికి మేం చింతిస్తున్నాం. నల్లజాతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అయితే రాబోయే తరాల బాగు కోసం ఇప్పుడు ఎదువతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, బలాన్ని పెంచుకుంటూ ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరోసారి ట్రంప్‌నకు అవకాశమివ్వండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా డెమొక్రటిక్‌ పార్టీ తరఫున జో బిడెన్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవగా.. ఆసియా(భారత్‌)- ఆఫ్రికా(జమైకా) మూలాలున్న కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం తెలిసిందే.(చదవండి: చీకటి నుంచి వెలుగులోకి తీసుకువస్తాం: జో బిడెన్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా