ఐక్యరాజ్య సమితి చర్చల్లో నిత్యానంద ‘యూఎస్‌కే’ ప్రతినిధి

1 Mar, 2023 05:09 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్థాపించిన దేశం ‘కైలాస’ ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాలుపంచుకుంది. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఈ నెల 24న చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస ప్రతినిధినంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ చర్చలో పాల్గొని, ప్రసంగించారు. హిందూ మతాన్ని, ఆచార సంప్రదాయాలను ప్రచారం చేస్తున్న నిత్యానందను భారతదేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. యూఎస్‌కే తరఫున ఇయాన్‌ కుమార్‌ అనే వ్యక్తి కూడా చర్చల్లో పాల్గొన్నారు.

అత్యాచారం, అపహరణ కేసుల్లో అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడంతో 2019లో నిత్యానంద దేశ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలో ఉంటూనే ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ దీవిని తన సొంత కైలాస దేశమని, 200 కోట్ల మంది హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. ఐరాస గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ముందుగా అవసరం. 193 దేశాల జాబితాలో యూఎస్‌కే లేదు. అయితే, జెనీవా చర్చలో పాల్గొన ద్వారా ఐరాస గుర్తింపు లభించిందనే తప్పుడు అభిప్రాయం కల్పించేందుకు యూఎస్‌కే ప్రయత్నించిందని పరిశీలకులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు