Pakistan Crisis: పాక్‌ అసెంబ్లీలో ఓటింగ్‌పై సస్పెన్స్‌.. వెన్నుచూపిన ఇమ్రాన్‌

9 Apr, 2022 11:49 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై కాసేపట్లో ఓటింగ్‌ జరుగనుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీకి 176 మంది ఎంపీలు ప్రతిపక్ష నేతలు హాజరు కాగా, అధికార పార్టీ పీటీఐ పార్టీ నుంచి కేవలం 27 మంది ఎంపీలు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు.

కాగా, అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌కు మిత్రపక్షాల నేతలు హ్యాండ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి అసెంబ్లీకి గైర‍్హాజరయ్యారు. పాక్‌ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఇమ్రాన్‌ సభకు వస్తారని అంత భావించినప్పిటికీ ప్రధాని మాత్రం రాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం కంటే ముందే ఇమ్రాన్‌ రాజీనామా చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో ప్రతిపక్ష నేత షాబాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశానుసారం మీరు (స్పీకర్) సభా కార్యకలాపాలను నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగం, చట్టం కోసం నిలబడాలని స్పీకర్‌ అసద్ ఖైజర్‌ను కోరారు. 

ఈ సందర్బంగా పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి, పీటీఐ నేత షా మహమూద్ ఖురేషీ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు అవిశ్వాసం తీర్మానం పెట్టడం వారికి రాజ్యంగం కల్పించిన హక్కు అని అన్నారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం సమర్థించడం ప్రభుత్వం బాధ​త్య అని పేర్కొన్నారు.

వీరు మాట్లాడిన అనంతరం సభలో గందరగోళం జరిగింది. అధికార పార్టీ నేతలు అవిశ్వాస తీర్మానంపై చర్చకు రావాలని పట్టుబట్టారు. దీంతో ప్రతిపక్ష నేతలు అవిశ్వాసంపై ఓటింగ్‌ జరపాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు