ఐసిస్‌ వధువు షమీమాకు యూకేలో నో ఎంట్రీ  

27 Feb, 2021 12:10 IST|Sakshi

లండన్‌: ఇస్లామిక్‌ స్టేట్‌ టెర్రర్‌ గ్రూప్‌ (ఐఎస్‌ఐఎస్‌)లో చేరేందుకు చిన్నప్పుడే సిరియాకి పారిపోయిన, బంగ్లాదేశ్‌ సంతతికి చెందిన లండన్‌ యువతి షమీమా బేగం(21)ని తిరిగి దేశంలోకి అనుమతి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో యూకే ప్రభుత్వం, న్యాయపోరాటంలో అతిపెద్ద విజయం సాధించినట్టయ్యింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని షమీమా బేగం ఇస్లామిక్‌ స్టేట్‌ టెర్రరిస్టు గ్రూప్‌లో చేరేందుకు 2015 ఫిబ్రవరిలో పారిపోయింది. ఈ కేసులో ఐదు ప్రధాన కోర్టులకు చెందిన న్యాయమూర్తులు బేగంని తిరిగి దేశంలోకి అనుమతించరాదని ఏకగ్రీవంగా ఈ తీర్పునిచ్చారు.

ఫిబ్రవరి 2019లో సిరియా శరణార్థి శిబిరంలో బేగంని గుర్తించిన తరువాత, జాతీయ భద్రతా కారణాల రీత్యా ఆమె బ్రిటిష్‌ పౌరసత్వాన్ని రద్దు చేశారు. సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా హోం శాఖ చేసిన అన్ని విజ్ఞప్తులను అనుమతించింది. బేగం క్రాస్‌ అప్పీల్‌ను కొట్టివేసినట్టు సుప్రీంకోర్టు అధ్యక్షుడు లార్డ్‌ రాబర్ట్‌రీడ్‌ చెప్పారు. బ్రిటన్‌లోని బంగ్లాదేశ్‌కి చెందిన దంపతులకు బేగం జన్మించారు. డచ్‌కి చెందిన ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాది యోగో రియడ్జిక్‌తో వివాహం నేపథ్యంలో ఐసిస్‌ వధువుగా బేగంని పిలుస్తున్నారు. తన బ్రిటిష్‌ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ యూకే హోంశాఖ తీసుకున్న నిర్ణయాన్ని బేగం సవాల్‌ చేశారు. ప్రస్తుతం బేగం సిరియాలో సాయుధ దళాల నియంత్రణ శిబిరంలో ఉన్నారు.  
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు