ఉక్రెయిన్‌పై అణుదాడి చేయం.. ఆ ఉద్దేశమే లేదు: రష్యా

7 May, 2022 08:13 IST|Sakshi

ఉక్రెయిన్‌ ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. ఒకవైపు పోరాడుతున్నా.. మరోవైపు ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళనతో ఉంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌పై అణు దాడి చేసే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని రష్యా ప్రకటించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అలెక్సీ జైట్సెవ్‌ ఒక ప్రకటన చేశారు.

అణు యుద్ధం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదన్న సిద్ధాంతానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కట్టుబడి ఉన్నారన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాలను ప్రయోగించే ఆలోచన లేదు.. అసలు ఉక్రెయిన్‌ యుద్ధరంగంలోకి దించే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. పనిలో పనిగా.. రష్యాను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని ఉక్రెయిన్‌తోపాటు పశ్చిమ దేశాలకు అలెక్సీ జైట్సెవ్‌ హితవు పలికారు.  

ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాలతో ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలు ఖండించారు అలెక్సీ జైట్సెవ్‌.

మరిన్ని వార్తలు