రష్యా ఆయిల్‌ కొనొద్దని ఎవరూ కోరలేదు

9 Oct, 2022 05:28 IST|Sakshi

చమురు మంత్రి హర్‌దీప్‌ స్పష్టీకరణ

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌ తనకు అనువైన దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటుందని చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దని భారత్‌ను ఏ దేశం కోరలేదని స్పష్టంచేశారు. శుద్ధ ఇంధనంకు సంబంధించి వాషింగ్టన్‌లో అమెరికా ఇంధన మంత్రి జెన్నీఫర్‌ గ్రహోల్మ్‌తో భేటీ సందర్భంగా హర్‌దీప్‌ మీడియాతో మాట్లాడారు.

‘ పెట్రోల్, డీజిల్‌ వినియోగం అత్యంత ఎక్కువగా ఉండే భారత్‌ విషయంలో ఇలాంటి చర్చ అనవసరం. తనకు అనువైన దేశం నుంచే భారత్‌ చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇండియా–అమెరికా గ్రీన్‌ కారిడార్‌ ఆలోచనపై జెన్నీఫర్‌ సానుకూలంగా స్పందించారు’ అని హర్‌దీప్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధం దరిమిలా రష్యాపై గుర్రుగా ఉన్న పశ్చిమదేశాలు ఆంక్షల కొరడా ఝులిపించాయి. దీంతో తక్కువ ధరకే అందివచ్చిన రష్యా చమురును భారత్‌ భారీస్థాయిలో దిగుమతిచేసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు