కరోనా వైరస్‌: చైనా సంచలన నిర్ణయం

11 Nov, 2022 08:25 IST|Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ కట్టడి విషయంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ కఠిన ఆంక్షలతో అక్కడి జనాలు చుక్కలు చూస్తున్నారు. అయితే ఏం జరిగినా సరే.. లాక్‌డౌన్‌, కఠిన ఆంక్షలపై వెనక్కి తగ్గేది లేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అక్కడి అధికారిక మీడియా ఈ విషయాన్ని ధృవీకరించింది. గత నెలలో జరిగిన అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ తీర్మానం సైతం ఇదే నిర్ణయానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
 
చైనాలో గత రెండున్నరేళ్లుగా ప్రజలు కరోనా కట్టడి చర్యలతో అల్లలాడిపోతున్న సంగతి తెలిసిందే. ఆకలి బాధలతో పాటు మానసిక సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నారు. అయినాసరే కరోనా వైరస్‌ టెస్టులు, లాక్‌డౌన్‌ పేరిట అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తోంది ఆ దేశం. అయితే.. ఎప్పటికప్పుడు వైరస్‌ రూపాంతరం చెందడం, కొత్త మ్యూటేషన్‌తో విజృంభిస్తుండడంతో ఆంక్షల సడలింపులను రద్దు చేస్తూ వస్తోంది అక్కడి ప్రభుత్వం. 

అయితే.. కరోనా ఆంక్షలను ప్రభుత్వం ఇప్పట్లో ఎత్తేసే ఆలోచనలో లేదని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పరిశోధకుడు వాంగ్‌ లిపింగ్‌ స్పష్టం చేశారు. ఆంక్షలను సడలించకపోగా.. మరింత కఠినతరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ ఆంక్షల విధింపు అనేది శాస్త్రీయబద్ధంగా ఉండబోతున్నట్లు తెలిపారాయన. ఈ మేరకు గత నెలలో జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ భేటీలో.. పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు.

ఇదీ చదవండి: అన్నంత పనిచేస్తున్న పుతిన్‌

మరిన్ని వార్తలు