నిరసనకారులపై షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్‌ జారీ చేయలేదు: శ్రీలంక ప్రధాని

19 May, 2022 14:28 IST|Sakshi

కొలంబో: హిందూ మహాసముద్ర ద్వీప దేశంలో తీవ్ర సంక్షోభం ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. శాంతియుతంగా సాగిన నిరసనలను.. దిగిపోయే ముందర తీవ్ర ఉద్రిక్తంగా మార్చేశాడు గత ప్రధాని మహింద రాజపక్స. అయితే నిరసనకారుల మీద మానవ హక్కుల ఉల్లంఘన ఆదేశాలు జారీ అయ్యాయంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో.. కొత్త ప్రధాని రణిల్‌ విక్రమసింఘే స్పందించారు.     
 
నిరసనకారుల మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. మే 10వ తేదీన శ్రీలంక రక్షణ శాఖ తన త్రివిధ దళాలకు.. దోపిడీలకు, దాడులకు, విధ్వంసాలకు పాల్పడే నిరసనకారుల మీద కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులు జారీ చేసింది. మహింద రాజపక్స అనుచరణ గణం మీద, వాళ్ల ఆస్తుల మీద దాడుల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే అలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఏం జారీ కాలేదని, సాధారణంగా పోలీసులకు తప్పనిసరి పద్ధతుల్లో.. అదీ పద్ధతి ప్రకారం కాల్పులకు దిగే అవకాశం ఉంటుందని, అంతేగానీ, నిరసనకారులపై కాల్పులు జరపమని ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం తరపున వెలువడలేదని ప్రధాని విక్రమసింఘే గురువారం పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం మరోలా చెబుతోంది. హింసాత్మక ఘటనలు మరింతగా పెరగకుండా ఉండేందుకే అలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్తుండడం గమనార్హం.  దీంతో ప్రభుత్వం, సైన్యం మధ్య సమన్వయ లోపం బయటపడినట్లయ్యింది.  

మరిన్ని వార్తలు