Nepal Plane Crash: నేపాల్‌ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు..

16 Jan, 2023 10:04 IST|Sakshi

నేపాల్‌లోని పోఖారా సమీపంలో ఆదివారం విమానం కుప్పకూలిన ఘటన ఘోర విషాదాన్ని మిగిల్చింది. సమయం గడిచే కొద్దీ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దుర్ఘటన సమయంలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉండగా.. ఎవరూ ప్రాణాలతో బయట పడేలా కనిపించడం లేదు. ఒక్కరైనా బతికి బట్టకడతారనే ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ప్రమాద స్థలం నుంచి అధికారులు ఇప్పటివరకు 68 మృతదేహాలను వెలికితీశారు. 

కాగా యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌-72 విమానం ఆదివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఖాట్మండు నుంచి బయలుదేరిన  విమానం పోఖారా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలో కుప్పకూలింది. మరికొద్ది క్షణాల్లో ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం మరింత బాధాకరం.  ఘటన సమయంలో విమానంలోప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 72 మంది ఉన్నారు. వీరిలో 68 ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. 

విమాన శిథిలాల నుంచి ఆర్మీ అధికారులు 68 మృతదేహాలను వెలికితీయగా.. మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఘటన జరిగిన ప్రాంతం ప్రమాదకర ప్రదేశం కావడంతో రెస్క్యూ ప్రయత్నాలకు ఆటంకం కలిగిందని ఆర్మీ సిబ్బంది చెబుతున్నారు. అలాగే ఆదివారం రాత్రి చీకటి పడటంతో రెస్క్యూ చర్యలకు బ్రేక్‌ పడిందని సోమవారం ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరిని ప్రాణాలతో గుర్తించలేదని నేపాల్‌ ఆర్మీ అధికార ప్రతినిధి క్రిష్ణ ప్రసాద్‌ బండారి తెలిపారు.
చదవండి: కేంద్ర మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం..

మరణించిన వారి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు  తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణీకులలో 15 మంది విదేశీ పౌరులు ఉన్నారని చెప్పారు. వీరిలో అయిదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు దక్షిణ కొరియన్లు, ఒక ఆస్ట్రేలియన్, ఒక ఫ్రెంచ్, ఒకరు అర్జెంటీనా కాగా మరొకరు  ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి.



మరిన్ని వార్తలు