భారత్‌తో వాణిజ్యం ఇప్పట్లో లేనట్టే

4 Apr, 2021 04:23 IST|Sakshi

తేల్చి చెప్పేసిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించలేమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతులు చేసుకోవాలంటూ ఎకనామిక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ(ఈసీసీ) చేసిన సిఫారసుల అమలును వాయిదా వేశారు. కేబినెట్‌ సహచరులతో చర్చించాక ఇమ్రాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాన్‌ పత్రిక తెలిపింది. భారత్‌తో ఇప్పట్లో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం కుదరదని వాణిజ్య శాఖకు, ఆర్థిక బృందానికి ఇమ్రాన్‌ తెలిపారు. దుస్తులు, చక్కెరను తక్కువ ధరకి దిగుమతి చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలన్నారు. పాక్‌ ఆర్థిక, వాణిజ్య రంగాలను బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్న ఈసీసీ కొన్ని వేల ప్రతిపాదనలు పరిశీలించాక భారత్‌ నుంచి పత్తి, దుస్తులు, చక్కెర దిగుమతి చేసుకోవాలంటూ సిఫారసులు చేసింది.

ఆ సిఫారసుల్ని ఆమోదించడానికి కేబినెట్‌కు పంపింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదంటూ పాకిస్తాన్‌ కేబినెట్‌ ఆ సిఫారసుల్ని తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్‌ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ 2019లో భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆ దేశంతో ఏ రకమైన సంబంధాలు పునరుద్ధరించబోమని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషి చెప్పారు. మరోవైపు భారత్‌ కూడా అంతే గట్టిగా పాక్‌కు వార్నింగ్‌లు ఇచ్చింది. పాక్‌ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర సంస్థల్ని కట్టడి చేసే వరకు తాము కూడా ఎలాంటి బంధాల్ని కొనసాగించమని భారత్‌ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత ఏడాది కరోనా సంక్షోభం సమయంలో భారత్‌ నుంచి దిగుమతయ్యే మందులు, వాటి తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై ఉన్న ఆంక్షల్ని పాక్‌ ఎత్తేసింది. 

>
మరిన్ని వార్తలు