ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. విజేతలు ఎవరూ ఉండరు: ప్రధాని మోదీ

2 May, 2022 21:17 IST|Sakshi

జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై స్పందించారు. యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. ఏదేశమూ విజయం సాధించలేదని అన్నారు. భారత్‌ శాంతికి మద్దతిస్తుందని, యుద్ధం ముగించాలని ప్రధాని మోదీ కోరారు. బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్‌ ఒలాప్‌ స్కోల్జ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. శాంతియుత చర్చలే ముందున్న ఏకైక మార్గమమని మరోసారి పేర్కొన్నారు. యుద్ధం ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై కూడా చూపుతోందన్న మోదీ.. యుద్ధంతో ఏర్పడిన మానవతావాద పరిణామాల గురించి భారత్‌ ఆందోళన చెందుతోందని మోదీ పేర్కొన్నారు.

కాగా 3 రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జర్మనీ చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు అక్క‌డి అధికారులు, ప్ర‌వాస భార‌తీయులు స్వాగ‌తం ప‌లికారు. ఈ సందర్భంగా బెర్లిన్‌లో భారత్‌-జర్మనీ అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. గ్రీన్‌ ఎనర్జీ, సుస్థిర ఇంధన భాగస్వామ్యం, హైడ్రోజన్‌ టాస్క్‌ఫోర్స్‌ వంటి తొమ్మిది ఒప్పందాలపై భారత్‌-జర్మనీ సంతకాలు చేశాయి.
చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022 ఏడాదిలో మొదటి విదేశీ పర్యటన జర్మనీలో జరగడం సంతోషంగా ఉందన్నారు. జర్మనీలో జూన్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఆదేశ ఛాన్సలర్ స్కోల్జ్ తెలిపారు. అయితే గతేడాది డిసెంబరులో ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్కోల్జ్‌తో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి.

ఇక ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు తెలుపుతుండ‌గా భార‌త్ త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఐరోపాలో మోదీ ప‌ర్య‌టిస్తుండ‌డం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐరోపా దేశాల‌తో బంధాన్ని పటిష్ఠం చేసుకునే దిశ‌గా మోదీ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. ముఖ్యంగా ఇంధన భద్రతే ఈ చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది. 
చదవండి: ఫిలిప్పిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 6గురు మృతి, 80 ఇళ్లు దగ్ధం

మరిన్ని వార్తలు