2021 Nobel Prize:ముగ్గురికి ఆర్థిక నోబెల్‌

12 Oct, 2021 11:50 IST|Sakshi

డేవిడ్, జాషువా, ఇంబెన్స్‌లకు ప్రఖ్యాత బహుమతి

స్టాక్‌హోం: కనీస వేతనాల పెంపుదల ఫలితాలను విశ్లేషించిన అమెరికాకు చెందిన డేవిడ్‌ కార్డ్‌కు ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్‌ బహుమతి లభించింది. మరో ఇద్దరు ఆర్థికవేత్తలతో కలిసి ఆయన ఈ బహుమతిని పంచుకోనున్నారు. కార్డ్‌తో పాటు అమెరికాకే చెందిన జాషువా ఆంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. బహుమతి మొత్తంలో సగాన్ని డేవిడ్‌ కార్డ్‌కు, మిగతా సగాన్ని జాషువా, గైడోకు అందజేస్తారు.

లేబర్‌ మార్కెట్, వలసలు, విద్యపై కనీస వేతనాల ప్రభావాన్ని కార్డ్‌ విశ్లేషించారు. అలాగే ఆర్థిక శాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ తెలిపింది. సామాజికంగా ఎదురయ్యే పలు ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధానమివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్, జాషువా, ఇంబెన్స్‌ రుజువు చేశారని అకాడమీ ప్రశంసించింది. వీరు ఆవిష్కరించిన ‘సహజ ప్రయోగాలు’.. వాస్తవ జీవిత పరిస్థితులు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని పేర్కొంది. కనీస వేతనాల పెంపుతో ఉద్యోగాల్లోసైతం పెరుగుదల నమోదైందని అమెరికాలో డేవిడ్‌ కార్డ్‌ చేసిన అధ్యయనంతో తెలియవచ్చింది. సామాజిక శాస్త్రంలోని కార్యకారణ ప్రభావంతో సామాజిక శాస్త్రంలోని పెద్ద సమస్యలకు సైతం పరిష్కారాలు లభిస్తాయనే విషయాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు నిరూపించారని నోబెల్‌ అకాడమీ పేర్కొంది. గత ఏడాది అర్థిక శాస్త్రంలో పాల్‌ ఆర్‌.విుల్‌గ్రామ్, రాబర్ట్‌ బి.విల్సన్‌ సంయుక్తంగా నోబెల్‌ బహుమతి అందుకున్నారు.
చదవండి: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్‌ కార్తీక్‌...!

ఏమిటీ పరిశోధన?  
ప్రొఫెసర్‌ డేవిడ్‌ కార్డ్‌ 1980వ దశకంలో అలెన్‌ క్రూగర్‌తో కలిసి కనీస వేతనాలపై పరిశోధన సాగించారు. ఇందుకోసం న్యూజెర్సీలోని రెస్టారెంట్లను ఎంచుకున్నారు. కనీస వేతనాన్ని 4.25 డాలర్ల నుంచి 5.05 డాలర్లకు పెంచినప్పుడు, పెంచకముందు నాటి పరిస్థితుల గురించి నిశితంగా అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయని కార్డ్‌ చెప్పారు. అందరూ అనుకుంటున్నట్లుగా కనీస వేతనాల పెంపు వల్ల ఉద్యోగాలేవీ పోలేదని ఆయన తెలిపారు. అయితే, తమ అధ్యయన ఫలితాలను తొలుత ఎవరూ నమ్మలేదని అన్నారు. అమెరికాలో దేశీయ ఉద్యోగాలపై వలసలు చూపే ప్రభావంపైనా ఆయన అధ్యయనం చేశారు. డేవిడ్‌ కార్డ్‌కు మిత్రుడైన అలెన్‌ క్రూగర్‌ గతంలోనే నోబెల్‌ ప్రైజ్‌ గెలుచుకున్నారు. అలెన్‌ క్రూగర్‌ 58 ఏళ్ల వయసులో 2019లో మరణించారు.


చదవండి: D-Mart: ఆకాశమే హద్దుగా డీమార్ట్‌ దూకుడు...!

మరిన్ని వార్తలు