పోటాపోటీగా ఉభయ కొరియాలా క్షిపణి పరీక్షలు

16 Sep, 2021 04:54 IST|Sakshi

సియోల్‌: ఉభయ కొరియాలు పోటా పోటీగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకొని ప్రాంతీయంగా ఉద్రిక్తతలకు తెరతీస్తున్నాయి. బుధవారం కొద్ది గంటల తేడాలో రెండు దేశాలు  క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. ఉత్తర కొరియా మళ్లీ  దిగువ శ్రేణి క్షిపణి ప్రయోగాలు రెండు చేయడంతో.. దక్షిణ కొరియా దానికి పోటీగా ఏకంగా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు చేసి తన సత్తా చాటింది.

జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించగలిగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఏడో దేశంగా నిలిచింది. కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్‌ అహ్‌ చంగ్‌ హో ద్వారా సముద్రగర్భంలో ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టుగా ద.కొరియా అధ్యక్ష భవనం వర్గాలు వెల్లడించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3 వేల టన్నుల బరువున్న సబ్‌మెరైన్‌ నుంచి నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి కచి్చతంగా ఛేదించింది. అంతకు ముందు ఉత్తర కొరియా రెండు షార్ట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. కాగా, ఇదిలాగే కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలగడం ఖాయమని ఉత్తరకొరియా అధినేత కిమ్‌ సోదరి యో జాంగ్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు