కొరియాల మధ్య కొత్త వివాదం

25 Sep, 2020 04:08 IST|Sakshi
వివాదాస్పద సరిహద్దు జలాల్లో గస్తీకాస్తున్న దక్షిణకొరియా నౌక

తమ పౌరుడిని ఉత్తరకొరియా కాల్చిచంపేసిందని ఆరోపిస్తున్న దక్షిణ కొరియా

సియోల్‌:  దక్షిణ కొరియా ఉద్యోగి ఒకరిని ఉత్తర కొరియా దళాలు కాల్చి చంపి, మృతదేహాన్ని తగలబెట్టాయి. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించినందుకు ఈ పని చేసి ఉండొచ్చని దక్షిణ కొరియా పేర్కొంది. ఆ వ్యక్తిని ఇరుదేశాల మధ్య వివాదాస్పద సరిహద్దులోని జలాల్లో ఒక చిన్న తెప్పలాంటి దానిపై ప్రయాణిస్తుండగా, గుర్తించి అదుపులోకి తీసుకుని చంపేశాయని గురువారం వెల్లడించింది. దక్షిణ కొరియా రక్షణ మంత్రి వెల్లడించిన సమాచారం మేరకు.. అక్రమ చేపల వేటను నిరోధించేందుకు ఉద్దేశించిన ఒక ప్రభుత్వ నౌక నుంచి ఆ ఉద్యోగి కనిపించకుండాపోయారు. ఆ తరువాత వివాదాస్పద జలాల్లో కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు మొదట నార్త్‌ కొరియా అధికారులు వెళ్లారు.

ఆ తరువాత, కాసేపటికి నౌకాదళ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ వ్యక్తిని కాల్చేశాయి. అనంతరం, ఆ ఉద్యోగిని తగలపెట్టాయి. ఆ ఉద్యోగి ఉత్తర కొరియాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని దక్షిణ కొరియా రక్షణ శాఖ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో అక్రమంగా సరిహద్దులు దాటేవారిని కనిపిస్తే కాల్చివేయాలని ఉత్తర కొరియా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తమ దేశంలో కరోనా ఇంకా అడుగుపెట్టలేదని ఉత్తర కొరియా చెబుతోంది. నార్త్‌ కొరియా దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులను శిక్షించాలని ఆ దేశాన్ని డిమాండ్‌ చేస్తున్నామని దక్షిణ కొరియా సీనియర్‌ మిలటరీ అధికారి ఆన్‌ యంగ్‌ హో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు