ఉ.కొరియాలో మళ్లీ అణు కార్యకలాపాలు

31 Aug, 2021 04:48 IST|Sakshi

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడి

సియోల్‌: ఉత్తరకొరియా తన ప్రధాన అణు రియాక్టర్‌ను అణ్వస్త్ర ఇంధన ఉత్పత్తి కోసం తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. తమ దేశంపై విధించిన ఆంక్షల తొలగింపు, ద.కొరియాతో సైనిక విన్యాసాలను అమెరికా నిలిపివేయకుంటే అణ్వస్త్ర తయారీని తిరిగి ప్రారంభిస్తామంటూ ఉ.కొరియా బెదిరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఏఈఏ ఈ మేరకు తన వార్షిక నివేదికలో పేర్కొంది. యాంగ్‌బియోన్‌లోని ప్రధాన అణు సముదా యంలో ఉన్న 5 మెగావాట్ల రియాక్టర్‌ను ఈ ఏడాది జూలై నుంచి పనిచేస్తున్నట్లు శాటిలైట్‌ చిత్రాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం విశ్లేషించి ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు తెలిపింది.

ఇదే సముదాయంలో ఉన్న రేడియో కెమికల్‌ లేబొరేటరీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు పని చేసినట్లు సూచనలు కనిపించాయని పేర్కొంది. అణ్వా యుధాల తయారీలో వినియోగించే ప్లుటోనియం ఈ సముదాయంలో ఉత్పత్తవుతుంది. రియాక్టర్ల నుంచి తొలగించిన ఇంధన కడ్డీలను తిరిగి ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా ఇక్కడ ప్లుటోనియంను వేరు చేస్తారు. ‘ఉ.కొరియా అణు కార్యకలాపాలను తిరిగి కొనసాగించడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం. 5 మెగావాట్ల రియాక్టర్‌తోపాటు రేడియో కెమికల్‌ లేబొరేటరీ తిరిగి పనిచేయించడం ఇబ్బందికరమైన విషయం’అని ఐఏఈఏ పేర్కొంది. తమ దేశంలోని అణు సముదాయాలను ఐఏఈఏ బృందాలు తనిఖీ చేయడాన్ని 2009 నుంచి ఉ.కొరియా నిలిపివేసింది.

మరిన్ని వార్తలు