మరోసారి రెచ్చిపోయిన నార్త్‌కొరియా.. జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం

5 Oct, 2022 08:56 IST|Sakshi

సియోల్‌: ఉత్తరకొరియా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశం జపాన్‌ మీదుగా మంగళవారం బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. అమెరికాకు చెందిన గ్వామ్‌ దీవిని సైతం తాకే సామర్థ్యమున్న ఈ అణు క్షిపణి ప్రయోగంతో జపాన్‌ ఉలిక్కి పడింది.

ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కొరియా మంగళవారం మధ్యంతర క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ పేర్కొనగా, అది మధ్యంతర లేదా దీర్ఘ శ్రేణి క్షిపణి అయి ఉంటుందని జపాన్‌ తెలిపింది.   

ఒకవేళ దీర్ఘ శ్రేణి క్షిపణి అయితే అమెరికా ప్రధాన భూభాగమే లక్ష్యంగా చేపట్టిన ప్రయోగమై ఉంటుందని నిపుణులు అంటున్నారు. తాజా పరిణామాన్ని ప్రమాదకరమైన, నిర్లక్ష్యపూరిత చర్యగా అమెరికా అభివర్ణించింది. ఈ ఏడాదిలో ఉత్తరకొరియా పలుమార్లు క్షిపణి పరీక్షలు జరిపి అమెరికా, మిత్రదేశాలకు తన సత్తా చూపింది.

చదవండి: (Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో)

మరిన్ని వార్తలు