ముందు వరుసలో శవపేటిక మోస్తూ.. గురుభక్తి చాటిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌

24 May, 2022 11:10 IST|Sakshi

ఉత్తర కొరియాలో ఒమిక్రాన్‌ విజృంభణకు కారణం.. అధికారుల నిర్లక్ష్యమే అని గుర్రుగా ఉన్నాడు నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా.. కరోనా నిబంధనలను మాత్రం కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. మాస్క్‌ నిబంధనలను పక్కనపెట్టాడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఎందుకంటారా?.. 

కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే మరణం.. అక్కడి ప్రభుత్వవర్గాల్లో విషాదాన్ని నింపింది. అయితే ఆయన అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన.. అందరి దృష్టి ఆకర్షించింది. 

ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని తన గురువుకి నివాళి అర్పించాడు. అంతేకాదు.. కరోనా భయంతో అంతా మాస్కులు ధరించిన వేళ ఆయన మాత్రం మాస్క్‌ లేకుండానే గురువుకి గౌరవం ఇచ్చాడు. మే 12న అక్కడ తొలి కరోనా కేసు ప్రకటన వెలువడగా.. అప్పటి నుంచి మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చివరకు కిమ్‌ కూడా మాస్క్‌ను వదలలేదు. అలాంటి గురువు శవపేటిక మోసే సమయంలో మాత్రం మాస్క్‌ను పూర్తిగా పక్కనపెట్టాడు.

కిమ్‌ జోంగ్‌-2 2011లో చనిపోయిన తర్వాత.. కిమ్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించింది హ్యోన్‌ చొల్‌ హయే. అందుకు గురుభక్తిని అంతగా చాటుకున్నాడు కిమ్‌. ఇది చూసిన వాళ్లంతా.. కర్కశంగా వ్యవహరించే కిమ్‌లో ఈ యాంగిల్‌ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, అమెరికా నుంచి వ్యాక్సిన్‌ సాయం ప్రకటన వెలువడినా.. కిమ్‌ నుంచి ప్రతి సమాధానం లేకపోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు