ఇంచు ముందుకొచ్చినా సర్వనాశనమే!: కిమ్‌ సోదరి వార్నింగ్‌

5 Apr, 2022 09:51 IST|Sakshi

కొరియా దేశాల మధ్య ఆయుధ సంపత్తి-సత్తా విషయంలో మాటల తుటాలు పేలుతున్నాయి. వాస్తవానికి యుద్ధానికి తాము వ్యతిరేకమని, ఒకవేళ దక్షిణ కొరియా గనుక దాడులకు తెగపడితే మాత్రం అణ్వాయుధాలు ప్రయోగించడానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు కిమ్‌ యో జోంగ్‌. 

ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి అయిన కిమ్‌ యో జోంగ్‌.. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అత్యాధునిక క్షిపణులు, అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని, అవి నేరుగా లక్ష్యంగా భావిస్తున్న ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తాయంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి షూ వుక్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో కిమ్‌ యో తీవ్రంగా స్పందించారు.

ఆయన వ్యాఖ్యలను భారీ తప్పిదంగా పేర్కొన్న కిమ్‌ యో.. అలాంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే అణ్వాయుధాల్ని దక్షిణ కొరియాపై ప్రయోగిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్యాంగ్‌యాంగ్‌(నార్త్‌ కొరియా రాజధాని) యుద్ధానికి వ్యతిరేకం. అలాగే దక్షిణ కొరియాను మేం ప్రధాన శత్రువుగా భావించడం లేదు. మమ్మల్ని కవ్వించనంత వరకు మేం మౌనంగానే ఉంటాం. ఒకవేళ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే మాత్రం.. సహించం. సౌత్‌కొరియా ఆర్మీ ఇంచు సరిహద్దులోకి వచ్చినా పెనువినాశనాన్ని దక్షిణ కొరియా చవిచూడాల్సి వస్తుంది’’ అని మంగళవారం నాటి ప్రకటనలో ఆమె వెల్లడించారు. 

ఇది మేం జారీ చేసే హెచ్చరిక కాదు.  జరగబోయే పరిణామాలకు మా ముందస్తు వివరణ అని స్పష్టం చేశారామె. ఇదిలా ఉండగా.. ఆదివారం సైతం ఆమె ఈ వ్యాఖ్యలపై స్పందించారు కూడా. ప్రమాదకరమైన సైనిక చర్యలకు సైతం సిద్ధమంటూ కిమ్‌ యో జోంగ్‌ వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మొదటి నుంచి క్షిపణులను విజయవంతంగా ప్రయోగిస్తూ అగ్రరాజ్యం సహా పొరుగు దేశాలు దక్షిణ కొరియా, జపాన్‌లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది ఉత్తర కొరియా.

మరిన్ని వార్తలు