ప్రపంచానికి మరో హెచ్చరిక.. తగ్గేదేలే అంటున్న నార్త్‌ కొరియా కిమ్‌

4 May, 2022 13:25 IST|Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: అమెరికాపై ఆగ్రహంతో ఉన్న నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వరుస క్షిపణి ప‍్రయోగాలతో బిజీగా ఉన్నారు. దానికి తగినట్టుగానే నార్త్‌ కొరియా బుధవారం మరో బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. 

వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా తూర్పు తీరం దిశగా మరోసారి బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు దక్షిణ కొరియా మిలటరీ తెలిపింది. నార్త్‌ కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌కు సమీపంలో ఉన్న సనన్‌ నుంచి ఈ క్షిపణి ప‍్రయోగం జరిగినట్టు వెల్లడించింది. దీంతో మరోసారి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దక్షిణకొరియా, అమెరికా, జపాన్‌లను ఆందోళనకు గురిచేశారు. కాగా, ఈ ఏడాదిలో ఇది 14వ క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం. 

ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 25వ తేదీన జ‌రిగిన మిలిట‌రీ ప‌రేడ్ త‌ర్వాత జ‌రిగిన తొలి క్షిప‌ణి ప‌రీక్ష ఇదే కావడం విశేషం. మరోవైపు.. అణ్వాయుధాల‌ను మ‌రింత వేగ‌వంతంగా సేక‌రించ‌నున్న‌ట్లు ఆ ప‌రేడ్ స‌మ‌యంలో కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన తర్వాత ఇలా క్షిపణి ప్రయోగం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక, దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అణ్వాయుధ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు కూడా ఉత్త‌ర కొరియా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రేడ్‌లో హాసాంగ్-17 ఖండాంత‌ర క్షిప‌ణిని నార్త్‌ కొరియా ప్రదర్శించింది. దానితో పాటు ప్ర‌ద‌ర్శ‌న‌లో మ‌ల్టిపుల్ గెయింట్ రాకెట్ లాంచ‌ర్లు, స‌బ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైళ్లు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ట్విటర్‌ ట్విస్ట్‌: ట్వీట్‌తోనే భారీ షాక్‌ ఇచ్చిన ఎలన్‌ మస్క్‌.. పైసా వసూల్‌!

>
మరిన్ని వార్తలు