ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్‌, సౌత్‌ కొరియా అలర్ట్‌

3 Nov, 2022 14:38 IST|Sakshi

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించి.. ఒక్కసారిగా సరిహద్దుల్లో ఉద్రిక్తతను మరింత పెంచింది ఉత్తర కొరియా. గురువారం ఈ దుశ్చర్యకు పాల్పడగా.. దక్షిణ కొరియా తన దేశ ప్రజలతో పాటు జపాన్‌ను సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

కొరియా సరిహద్దులో ఉత్తర దిశగా లాంగ్‌ రేంజ్‌తో పాటు రెండు షార్ట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణులను  ఉత్తర కొరియా పరీక్షించింది. నార్త్‌ కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లోని సునాన్‌ ప్రాంతం నుంచి ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో దూర శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైల్‌ను పరీక్షించినట్లు గుర్తించామని సియోల్‌ మిలిటరీ ప్రకటించింది. ఈస్ట్‌ ప్రాంతం వైపుగా ఈ ప్రయోగం జరిగిందని.. ఈ ప్రాంతానికి సీ ఆఫ్‌ జపాన్‌గా గుర్తింపు ఉందని తెలిపింది. 

ఆ వెంటనే ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో.. ప్యోన్‌గాన్‌ దక్షిణ ప్రావిన్స్‌లోని కయెచోన్‌ నుంచి రెండు షార్ట్‌రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ పరీక్షించినట్లు సియోల్‌ మిలిటరీ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. సౌత్‌ కొరియా తూర్పు ద్వీపమైన ఉల్లెయుంగ్దో ప్రాంతంలో బుధవారం హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు గురువారం దాడితోనూ తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సియోల్‌ వర్గాలు సూచించాయి. ఇంకోవైపు జపాన్‌ సైతం ‘జే అలర్ట్‌’ ద్వారా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

బుధవారం ఒక్కరోజే నార్త్‌ కొరియా ఏకంగా 20 క్షిపణులను పరీక్షించింది. అందులో ఒకటి దక్షిణ కొరియా సరిహద్దు జలాల్లో పడిపోవడంతో అప్రమత్తం అయ్యింది సియోల్‌. కొరియా విభజన తర్వాత ఈ స్థాయిలో దగ్గరగా క్షిపణి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సియోల్‌-వాషింగ్టన్‌ దళాలు సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహించగా.. ప్రతిగానే నార్త్‌ కొరియా ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. రెండు రోజుల్లోనే 23 క్షిపణులను పరీక్షించి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది.

మరిన్ని వార్తలు