అణు, మిసైల్‌ ప్రోగ్రాంలకు నిధుల కోసం... ఉత్తర కొరియా సైబర్‌ దాడులు

8 Feb, 2022 05:03 IST|Sakshi

క్రిప్టో సంస్థలు, ఎక్సే్ఛంజీల నుంచి కోట్లాది డాలర్లు కొట్టేస్తోంది: ఐరాస

ఐరాస: అణు, మిసైల్‌ కార్యక్రమాలకు నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్‌ దాడులకు తెగబడుతోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. సైబర్‌ స్పెషలిస్టులను ఉటంకిస్తూ ఐరాస నిపుణుల ప్యానల్‌ సోమవారం ఈ మేరకు వెల్లడించింది. ‘‘ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లోని మూడు క్రిప్టో ఎక్స్‌చేంజీల నుంచి 2020 నుంచి 2021 మధ్య కనీసం 5 కోట్ల డాలర్లను ఉత్తర కొరియా కొట్టేసింది. అలాగే వాటిపై ఏడుసార్లు సైబర్‌ దాడులకు తెగబడి 40 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీనీ దొంగిలించింది.

ఆ సంస్థల ఇంటర్నెట్‌ కనెక్టెడ్‌హాట్‌ వాలెట్ల నుంచి మాల్‌వేర్, ఫిషింగ్, కోడ్‌ ఎక్స్‌ప్లాయిట్స్, ఇతర అధునాతన సోషల్‌ ఇంజనీరింగ్‌ మార్గాల్లో కాజేసిన ఈ నిధులను డీపీఆర్‌కే నియంత్రిత అడ్రస్‌లకు తరలిస్తోంది. తర్వాత పకడ్బందీ మనీ లాండరింగ్‌ ప్రకియ ద్వారా క్రిప్టో కరెన్సీని సొమ్ము చేసుకుంటోంది’’ అని ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఈ ప్యానెల్‌ వివరించింది. డీపీఆర్‌కే అంటే డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా.

2019–2020 మధ్య కూడా సైబర్‌ దాడుల ద్వారా 32 కోట్ల డాలర్లకు పైగా ఉత్తర కొరియా కొట్టేసిందని ఏడాది కిందే ఈ ప్యానెల్‌ ఆరోపించింది. నిషేధాలను ఉల్లంఘిస్తూ అణు, ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉందని తాజా రిపోర్టులో పేర్కొంది. ‘‘అణు పరీక్షల్లాంటివి జరిపినట్టు ఆధారాల్లేకున్నా కీలకమైన యురేనియం, ఫ్లూటోనియం తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ వస్తోంది. ఖండాంతర బాలిస్టిక్‌ మిసైళ్ల ప్రయోగంపై విధించుకున్న నాలుగేళ్ల స్వీయ నిషేధాన్ని పక్కన పెడతామని కొరియా ఇటీవల హెచ్చరిస్తూ వస్తుండటం తెలిసిందే. 

మరిన్ని వార్తలు