ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు

14 Sep, 2021 04:20 IST|Sakshi

1,500 కి.మీ. లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం

అంతర్జాతీయ సమాజానికి ముప్పేనని అమెరికా ఆందోళన

సియోల్‌: సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్‌ క్షిపణి పరీక్షలు ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించింది. శని, ఆదివారాల్లో వరుసగా రెండు రోజులు ఉత్తర కొరియా నిర్వహించిన ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్టుగా ఆ దేశ అధికారిక కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ సోమవారం వెల్లడించింది. అమెరికాతో అణు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఉత్తర కొరియా తమ ఆయుధ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలన్న ఉద్దేశంతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కొత్త క్షిపణి 1,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. ఉ.కొరియాపై శత్రువులు ఎవరైనా దాడి చేస్తే దానిని గుర్తించి సమర్థంగా తిప్పికొట్టి రక్షణని కలి్పంచే సామర్థ్యం ఈ క్షిపణి సొంతం.  

అణు వార్‌హెడ్లు మోసుకుపోగలదా?  
ఈ క్షిపణిని ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అభివర్ణించింది. ఇది అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌లలో ఉన్న లక్ష్యాలను  ఛేదించగలదని నిపుణులు చెబుతున్నారు. ‘వ్యూహాత్మక ఆయుధమని ఉత్తర కొరియా చెబుతోందంటే దీనికి అణు వార్‌హెడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. అయితే వాటిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉత్తర కొరియాకు ఉందో లేదో చెప్పడం కష్టం’ అని అమెరికాకు చెందిన కార్నేజ్‌ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ సభ్యుడు అంకిత్‌ పాండా చెప్పారు.

అమెరికా, దక్షిణ కొరియా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని, అందుకే ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్టుగా ఇప్పటికే కిమ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.  బాలిస్టిక్‌ క్షిపణులు, అణ్వాయుధాల తయారీపై అంతర్జాతీయంగా ఉత్తరకొరియాపై ఆంక్షలున్నాయి. కానీ క్రూయిజ్‌ క్షిపణులపై ఎలాంటి ఆంక్షలు లేవు. మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా నిరంతరం అణ్వాయుధాలపైనే దృష్టి సారించి ఇలా పరీక్షలు చేయడం అంతర్జాతీయ సమాజానికి కూడా ముప్పేనని యూఎస్‌ ఇండో పసిఫిక్‌ కమాండ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.
క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగ దృశ్యాలు

మరిన్ని వార్తలు