ఉ. కొరియా ప్రజల గుండెల్లో గుబులు.. ఎల్లోడస్ట్‌తో కరోనా?

23 Oct, 2020 21:31 IST|Sakshi
ఎల్లోడస్ట్‌తో నిండిపోయిన కారు(కర్టెసీ: ట్విటర్‌)

మంగోలియన్‌ ఎడారుల నుంచి వస్తున్న ఎల్లోడస్ట్‌

ప్యాంగ్యాంగ్‌: ప్రపంచమంతా కరోనా వైరస్‌ ధాటికి వణికిపోతున్న తొలినాళ్లలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం తన రూటే సపరేటు అన్నట్లు వ్యవహరించారు. చైనాలోని వుహాన్‌ నగరంలో మహమ్మారి ఆనవాళ్లు బయటపడిన నేపథ్యంలో దేశ సరిహద్దులను మూసివేసి.. అందరినీ ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే మరణమే శరణ్యం అనే పరిస్థితులు కల్పించారు. అంతేకాదు తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటూ అధికార మీడియా వేదికగా ప్రకటనలు జారీ చేశారు. అయితే జూలై నాటికి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అప్పటికే కిమ్‌ అనారోగ్య వార్తల నేపథ్యంలో, వాటిని కొట్టిపారేసే విధంగా ఆయన సమావేశాల్లో పాల్గొన్నట్లుగా ఫొటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జూలై 25 తర్వాత తమ దేశంలో తొలి కరోనా కేసు నమోదు వెల్లడైనట్లు ప్రకటన వెలువరించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కిమ్‌, కోవిడ్‌ కేసు వెలుగుచూసిన కేసాంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించేలా ఆదేశాలు జారీచేశారు. (చదవండి: 5 వ్యాక్సిన్లు : 100 కోట్ల డోసులు  )

ఇక ఇటీవల జరిగిన అధికార వర్కర్స్‌ పార్టీ 75వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న కిమ్‌, దేశంలో కరోనా వైరస్‌ ముప్పుని తొలగించడంలోనూ, వరద పరిస్థితులు తలెత్తినప్పుడు చేసిన సాయాన్ని గుర్తుచేస్తూ సైనికులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో విఫలమయ్యానంటూ ఉద్వేగానికి లోనై కంటతడి పెడుతూ, జాతిని క్షమాపణ కోరిన వీడియోను స్థానిక మీడియా ప్రసారం చేసింది. నియంతలా వ్యవహరిస్తూ, ఎల్లప్పుడూ ప్రజల్ని తన అదుపాజ్ఞల్లో ఉంచే కిమ్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఉత్తర కొరియా అధికార మీడియా జారీ చేసిన మరో ప్రకటన స్థానిక ప్రజల గుండెల్లో గుబులుపుట్టిస్తోంది. మరోసారి కరోనా భయం వారిని వెంటాడుతోంది. 

ఎల్లో డస్ట్‌తో కరోనా ఆగమనం?!
చైనీస్‌, మంగోలియన్‌ ఎడారుల మీదుగా వీచే పవనాలు మోసుకొస్తున్న ఇసుక, దుమ్మధూళి కణాలతో ప్రాణాంతక కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఉత్తరకొరియా బుధవారం హెచ్చరికలు జారీచేసింది. బహిరంగ కార్యకలాపాలన్నింటిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు ఇవ్వడంతో రాజధాని ప్యాంగ్యాంగ్‌ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ‘‘దుష్ట, హానికరమైన వైరస్‌ల రాకతో ప్రమాదం పొంచి ఉన్నందున కార్మికులంతా ఇళ్లల్లోనే ఉండాలంటూ’’ అధికార వార్తా పత్రిక ద్వారా ప్రజలను అప్రమత్తం చేసింది.

అదే విధంగా యెల్లో డస్ట్‌ ప్రమాదం గురించి వివిధ రాయబార కార్యాలయాలకు సైతం సమాచారం ఇచ్చింది. ఈ విషయం గురించి ప్యాంగ్యాంగ్‌లోని రష్యన్‌ ఎంబసీ తన ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించింది. ఇసుక తుపానులతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయినట్లు పేర్కొంది. అందరూ ఇంటికే పరిమితం కావాలని, తలుపులు, కిటికీలు బిగించుకోవాలని సూచించినట్లు తెలిపింది. 

కాగా కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో, మిత్రదేశం చైనా ఎడారుల నుంచి తమ భూభాగం మీదకు కొట్టుకువస్తున్న ఎల్లోడస్ట్‌ మరింత హానికరంగా మారే ప్రమాదం ఉందని ఉత్తర కొరియా వాదిస్తుంటే, దక్షిణ కొరియా మాత్రం ఈ హెచ్చరికలను కొట్టిపారేస్తోంది. ధూళికణాల ద్వారా కోవిడ్‌ వ్యాపించే అవకాశం లేదని అభిప్రాయపడుతోంది. ఇక కరోనా వైరస్‌ గాలిలో కొన్ని గంటలపాటే నిలిచి ఉంటుందని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఉత్తరకొరియాతో పాటు తుర్కెమిస్తాన్‌ కూడా తన ప్రజలకు ఇదే తరహా ఆదేశాలు జారీ చేసినట్లు బీబీసీ డిస్‌ఇన్‌ఫర్మేషన్‌ టీం వెల్లడించింది. కాగా ఏటా నిర్దిష్ట కాలాల్లో ఉభయ కొరియా భూభాగాల మీదకు చైనా ఎడారుల నుంచి వీచే ఎల్లోడస్ట్, ప్రజల్లో ఆరోగ్య సంబంధిత ఆందోళనలకు కారణమవుతోంది.

మరిన్ని వార్తలు