నార్వేలో ‘టీకా’ విషాదం

17 Jan, 2021 05:04 IST|Sakshi

కోవిడ్‌ ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న 23 మంది వృద్ధులు మృత్యువాత

మరో 16 మందికి అస్వస్థత

ఓస్లో: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్‌వ్యాక్సిన్‌ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి చెందారు. వీరితోపాటు అస్వస్థతకు గురైన 16 మందిలో 9 మంది టీకా తీసుకున్న వెంటనే తీవ్రమైన బాధతో ఇబ్బంది పడ్డారని, వీరికి అలెర్జీ లక్షణాలు, తీవ్ర జ్వరం కనిపించాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనతో టీకా భద్రతపై ఉన్న అనుమానాలు మరింత బలపడ్డట్టయిందని పరిశీలకులు అంటున్నారు. అయితే, 80 ఏళ్లు పైబడి, వయో భారంతో బలహీనంగా ఉండటంతో వ్యాక్సిన్‌తో సాధారణంగా తలెత్తే దుష్పరిణామాలు వీరిపై తీవ్ర ప్రభావం చూపినట్లు పరీక్షల్లో తేలిందని ప్రభుత్వం తెలిపింది. మరణించిన 23 మందికిగాను 13 మందిలో వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సాధారణ లక్షణాలే కనిపించాయంది.

కోవిడ్‌ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న ఆరోగ్య శాఖ సిబ్బంది, వృద్ధులకు డిసెంబర్‌ నుంచి ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ తయారీ టీకాను నార్వే ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటి వరకు 33 వేల మందికి మొదటి డోసుగా ఈ వ్యాక్సిన్‌ వేశారు. ఈ ఉదంతం నేపథ్యంలో కోవిడ్‌ టీకా ఎవరికి ఇవ్వాలనే విషయంలో వైద్యులు మరింత జాగ్రత్తగా పరిశీలన జరపాలని, 80 ఏళ్లు పైబడిన వారి మిగిలిన జీవిత కాలం చాలా స్వల్పంగా ఉండటంతో, వారికి టీకా ఇవ్వడం ద్వారా పెద్దగా లాభమేమీ కూడా ఉండదని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసినట్లు ‘బ్లూమ్‌బర్గ్‌’తెలిపింది. యువజనులు, ఆరోగ్యంతో ఉన్న వారికి మాత్రం వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో నార్వే ప్రభుత్వానికి సహకరిస్తామని సదరు టీకా తయారీ సంస్థ ఫైజర్‌ తెలిపింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు