నిజంగా విడ్డూరమే! మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు, వైరల్‌ వీడియో

19 Aug, 2022 18:34 IST|Sakshi

మూడేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తూనే ఉంది. ఈ వైరస్‌ సోకిందో లేదో తెలియాలంటే ముందుగా కోవిడ్‌ టెస్టు చేయించుకోవాల్సిందే! జ్వరం, దగ్గు, జలుబు, నీరసం.. ఇలా ఎలాంటి లక్షణాలు కనిపించినా కరోనా ఏమోనని భయపడి టెస్టులకు క్యూ కట్టేవారు. అయితే ఇప్పటి వరకు సాధారణంగా కేవలం మనుషులకు మాత్రమే ఈ కరోనా టెస్టులు చేశారు. తాజాగా మానవులతోపాటు చేపలు, పీతలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. చైనాలోని జియామెన్‌లో ఈ సంఘటన జరిగింది.

చైనాలోని సముద్రతీర నగరం జియామెన్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. జియామెన్‌లో 40 మందికి కోవిడ్‌ సోకడంతో.. నగరంలోని అయిదు మిలియన్ల మందికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కేవలం మనుషుకు మాత్రమే కాదు. కొన్ని రకాల సముద్రజీవులకు కూడా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 

సముద్రం మీద వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వచ్చినపుడు.. వారితోపాటు తీసుకొచ్చిన చేపలు, జలచరాలకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఫలితంగా  బతికున్న చేపలు, పీతలకు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు ట్విటర్‌లో పోస్టు చేసింది. ఇందులో పీపీఈ కిట్‌ ధరించిన వైద్యాధికారులు చేపలు, పీతలు వంటి జలచరాల స్వాబ్‌ తీసి కోవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
చదవండి: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్‌ దంపతులు

అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది చేపలకు టెస్టులు చేయడాన్ని సపోర్ట్‌ చేస్తుంటే మరికొంతమంది ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ అధికారుల తీరును విమర్శిస్తున్నారు. కాగా తమ నిర్ణయాన్ని జియామెన్ మున్సిపల్‌ ఓషియానిక్ డెవలప్‌మెంట్ బ్యూరో అధికారులు సమర్థించుకున్నారు. కరోనా కల్లోలం రేపిన హైనాన్‌ నుంచి తాము పాఠం నేర్చుకున్నామని తెలిపారు. విదేశీయుల నుంచి మత్స్యకారులకు వైరస్‌ సోకి సముద్ర ఉత్పత్తులకు వ్యాపిస్తున్నదని చెప్పారు. 

>
మరిన్ని వార్తలు