లైవ్‌లో యాంకర్‌ గోస.. తప్పతాగాడన్న ఛానెల్‌

25 Jun, 2021 13:02 IST|Sakshi

శనివారం సాయంత్రం వార్తలు. కేబీఎన్‌ ఛానెల్‌లో న్యూస్‌ ప్రోగ్రామ్‌. ఎప్పటిలాగే బులిటెన్‌ చదివుతున్నాడు యాంకర్‌ కమ్‌ న్యూస్‌రీడర్‌ కబిందా కలిమీనియా. హెడ్‌లైన్స్‌ పూర్తయ్యాయి. ఇక మెయిన్‌ వార్తల్లోకి ఎంట్రీ ఇవ్వాలి.  ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆగిపోయాడు. ‘‘లేడీస్‌ అండ్‌ జెంటిల్మెన్‌.. వార్తల మధ్య నుంచి వైదొలుగుతున్నందుకు మన్నించాలి. మేమూ మనుషులమే. మాకు జీతాలు అందాలి కదా’’ అంటూ నిట్టూర్పు విడిచాడు. 

‘‘బాధాకరమైన విషయం ఏంటంటే.. షరోన్‌, ప్రతీ ఒక్కరూ, నాతోసహా ఇక్కడున్న చాలామందిలో ఎవరికీ జీతాలు ఇవ్వట్లేదు’’ అని మాట్లాడుతుండగానే.. లైవ్‌ను అర్థాంతరంగా కట్‌ చేశారు. జాంబియాలో ఓ న్యూస్‌ ఛానెల్‌ లైవ్‌లో జరిగిన ఈ వ్యవహారం అక్కడి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఛానెల్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యాంకర్‌ తీరును కేబీఎన్‌ టీవీ సీఈవో కెన్నెడీ మాంబ్వే తప్పుబట్టాడు. ‘‘ఆ యాంకర్‌ తప్పతాగి డ్యూటీకి వచ్చాడు, సహించేది లేదు, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం’’ అని కేబీఎన్‌ ఒక ప్రకటన రిలీజ్‌ చేసింది. 

అయితే కలిమీనియా మాత్రం తానేం తాగి లేనని చెబుతున్నాడు. నేను ఒకవేళ తాగి ఉంటే.. అదేరోజు అప్పటికే మూడు షోలను ఎలా నిర్వహించి ఉంటా? అబద్ధాలకైనా ఓ హద్దుండాలి అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు కలిమినియా. చాలా రోజుల నుంచి మాకు జీతాల్లేవ్‌. మాలో చాలా మంది ఉద్యోగాలు పోతాయేమోనని భయపడుతున్నారు. ఆ భయం నాలో చచ్చిపోయింది. ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. అందుకే లైవ్‌లోనే నిలదీశా అని చెబుతున్నాడు కలిమీనియా. ప్రస్తుతం ఈ ఫ్రస్టేషన్‌ జర్నలిస్ట్‌ వీడియో వైరల్‌ అవుతోంది.

చదవండి: అందగత్తె తొడలపై జూమ్‌, ఆపై..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు