కిమ్‌ ప్రకటన: ఒక్కటంటే ఒక్క కరోనా కేసు లేదు

7 Apr, 2021 20:04 IST|Sakshi

పోంగ్యాంగ్‌: మహమ్మారి కరోనా వైరస్‌ ఏడాదిన్నర నుంచి భూగోళాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. మానవాళి పాలిట మహమ్మారిగా తయారైంది. ఎంతకీ వదలలేదు. ప్రతి దేశాన్నీ పలకరించి నాశనం చేసింది. అయితే అబ్బే మా దేశంలో ఏ కేసు లేదు.. ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా ప్రకటించింది. తమ దేశం కరోనా రహితమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు విన్నవించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓకు బుధవారం ఉత్తర కొరియా ఓ నివేదిక అందించింది.

కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే తాము స్పందించి కట్టడి చర్యలు తీసుకున్నామని వివరించింది. పర్యాటక ప్రాంతాల మూసివేత, సందర్శకులకు నిషేధం, విదేశీ ప్రతినిధులను పంపించి వేయడం, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడం తదితర చర్యలతో ఇప్పటికీ తమ దేశం కరోనా రహితంగా ఉందని ఉత్తర కొరియా డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి ఎడ్విన్‌ సాల్వడర్‌ తెలిపారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. గతేడాది వైరస్‌ ప్రపంచమంతా వ్యాప్తి చెందిన సమయంలో తమ దేశంలో పరీక్షలు చేశామని వివరించారు. ఇప్పటివరకు మొత్తం 23,121 పరీక్షలు చేశామని వారిలో ఎవరికీ కూడా పాజిటివ్‌ రాలేదని చెప్పారు. తాజాగా ఈ సంవత్సరం ఏప్రిల్‌ మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు 732 మందికి పరీక్షలు చేసినట్లు ఆ ప్రతినిధి డబ్ల్యూహెచ్‌ఓకు విన్నవించారు. 

ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో తమ దేశం ఇప్పటికీ కరోనా రహితం అని ప్రకటించారు. అయితే ఉత్తర కొరియా ప్రకటనను ఎవరూ నమ్మడం లేదు. దేశం గురించి వాస్తవ వివరాలు తెలిపే అన్ని మార్గాలు మూసివేయడం, నిషేధంతో ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. దీంతో ఆ దేశ ప్రభుత్వం ప్రకటించే విషయాలపై విశ్వాసం లేదని పలు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇక టోక్యో ఒలంపిక్స్‌కు తమ దేశ క్రీడాకారులను పంపించడం లేదని మంగళవారం ఉత్తర కొరియా ప్రకటించింది. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

చదవండి: కరోనా బారిన మరో ముఖ్యమంత్రి
చదవండి: సంపూర్ణ లాక్‌డౌన్‌ 9 నుంచి 19 వరకు మొత్తం బంద్‌

మరిన్ని వార్తలు