‘హెచ్‌1బీ’ కేసులో ట్రంప్‌కు ఊరట

18 Sep, 2020 04:39 IST|Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌1బీ వీసా నిషేధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ట్రంప్‌ జూన్‌ 22న ప్రకటించిన హెచ్‌1బీ వీసా ఆంక్షలను సవాల్‌ చేస్తూ 169 మంది ఎన్‌ఆర్‌ఐలు అమెరికా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని అక్కడి కోర్టు తిరస్కరించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, కోవిడ్‌ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయని ట్రంప్‌ హెచ్‌1బీ వీసాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీని ప్రకారం ట్రంప్‌ హెచ్‌1బీ వీసాలపై విధించిన ఆంక్షలు ఈ యేడాది చివరి వరకు అమల్లో ఉంటాయి.

హెచ్‌1బీ, వీసాల రద్దు నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార, వాణిజ్యాలకు తీవ్రమైన నష్టం చేకూరుస్తుందని, ఇది దిద్దుకోలేని తప్పిదమని అమెరికాలోని సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థలు హెచ్చరించాయి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, ఇటీవల భారత్‌కు వచ్చిన 169 మంది భారతీయులు తిరిగి అమెరికా వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. వీసాలపై నిషేధం ఏకపక్షమని, తక్షణం తమ వీసాలను పునరుద్ధరించాలని భారతీయులు ఆ పిటిషన్‌లో కోరారు. అయితే వీసాపై ఆంక్షలు వి«ధించకుండా అడ్మినిస్ట్రేషన్‌ని నియంత్రించలేమని వాషింగ్టన్‌ జిల్లా జడ్జి అమిత్‌ మెహతా ట్రంప్‌కి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పుని పై కోర్టులో అప్పీల్‌ చేయనున్నట్టు భారతీయ పౌరుల తరఫు లాయర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు